JNTU | హైదరాబాద్, డిసెంబర్ 28 (నమస్తే తెలంగాణ) : మార్కెట్ ట్రెండ్స్, పరిశ్రమలు ఆశించిన నైపుణ్యాల ప్రకారం కొత్త సిలబస్ రూపకల్పనకు జేఎన్టీయూ కసరత్తు ముమ్మరం చేసింది. వర్సిటీ పరిధిలోని అన్ని కోర్సుల కరికులాన్ని మార్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నది. ఆర్-25 పేరుతో కొత్త సిలబస్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. ఇందుకు అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ)మాడల్ కరికులం, ఐఐటీ మద్రాస్‌లో నిర్వహిస్తున్న కోర్సుల సిలబస్‌ను ప్రమాణికంగా తీసుకుని కొత్త సిలబస్‌ను రూపొందించనున్నారు. జేఎన్టీయూలో ప్రతి మూడేండ్లకోసారి సిలబస్ మార్చడం ఆనవాయితీ. ఆర్-22 పేరుతో మూడేండ్ల క్రితం సిలబస్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ సిలబస్ గడువు ముగియనున్నది. తాజాగా ఆర్-25 పేరుతో కొత్త సిలబస్‌ను రూపొందించనున్నారు.
జేఎన్టీయూ ఆచార్యులు ఇప్పటికే కొంత మాడల్ సిలబస్‌ను రూపొందించారు. అందులో మార్పులు.. చేర్పులు చేసి, పూర్తిస్థాయి సిలబస్‌ను రూపొందించనున్నారు. ఇందుకోసం 7న నోవాటెల్ హోటల్లో ఇండస్ట్రీ వర్గాలతో, 8న కాలేజీల ప్రిన్సిపాళ్లు, ఆచార్యులతో మేధోమథనం నిర్వహిస్తారు. సెమినార్‌కు అటానమస్, అఫిలియేటెడ్ కాలేజీల ప్రిన్సిపాళ్లు, ఆచార్యులను ఆహ్వానించారు. మేజర్, మైనర్ డిగ్రీలు, ఎమర్జింగ్ కోర్సుల సిలబస్‌ను మార్చడంపై దృష్టిసారించినట్టు జేఎన్టీయూలోని ఓ సీనియర్ ప్రొఫెసర్ తెలిపారు. ఎన్ఈపీని అనుసరించి, విద్యార్థుల అభిరుచులు, పరిశ్రమ అవసరాల మేరకు కొత్త సిలబస్ ఉంటుందని ఆయన తెలిపారు.
కొత్త సిలబస్ రూపకల్పన ఏకపక్షంగా ఉండదు. అందరి సలహాలు స్వీకరిస్తాం. మంచి ఎక్కడున్నా తీసుకుంటాం. ఈ సారి ఐఐటీ మద్రాస్, ఏఐసీటీఈ సంస్థల ప్రతినిధులను ఆహ్వానించాం. ఇంజినీరింగ్, ఫార్మా పరిశ్రమ వారిని సైతం భాగస్వామ్యం చేస్తున్నాం. రీసెర్చ్ కల్చర్‌ను మరింతగా ప్రోత్సహించాల్సి ఉంది. ఈ దిశలోనే సిలబస్ ఉంటుంది. ఇంటర్న్‌షిప్‌లు, కోర్సు పూర్తికాగానే ఉద్యోగం కల్పించే అత్యుత్తమ సిలబస్‌ను అందుబాటులోకి తీసుకురావాలనుకుంటున్నాం.
– ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి, జేఎన్టీయూ వీసీ