హైదరాబాద్, జూన్ 24, (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని ఇంజినీరింగ్ కాలేజీలకు ఫీజు రీయింబర్స్మెంట్ పథకం కింద చెల్లించాల్సిన బకాయిలను ఎప్పటిలోగా చెల్లిస్తారో నిర్దిష్టంగా గడువు చెప్పాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ఫీజు బకాయిలు కోట్ల రూపాయల్లో ఉంటే కాలేజీల నిర్వహణ ఎలా సాధ్యమని, ప్రభుత్వం ఫీజులు చెల్లించకుండా, విద్యార్థుల నుంచి వసూలు చేసుకోనీయకపోతే కాలేజీల నిర్వహణ ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించింది. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలతోపాటు విద్యార్థులపై ఒత్తిడి తీసుకురావద్దంటూ ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ పలు కాలేజీలు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి. వీటిపై జస్టిస్ జువ్వాడి శ్రీదేవి బుధవారం విచారణ చేపట్టారు.
పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ.. ప్రభుత్వం ఉపసంహరించి జీవో-8ని జారీ చేసిందని, అనంతరం ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు మార్గదర్శకాలను నిర్దేశిస్తూ జీవో-9ని జారీ చేసిందని వివరించారు. ఏప్రిల్ 29న జారీ చేసిన జీవో-7లోని ఒక నిబంధన గతంలో హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులకు విరుద్ధంగా ఉన్నదని తెలిపారు. ఈ నిబంధన ప్రకారం.. విద్యార్థుల ఖాతాల్లో ప్రభుత్వం ఫీజు సొమ్మును జమ చేసిన తరువాత విద్యార్థులు కాలేజీకి చెల్లించాల్సి ఉంటుందని, అప్పటివరకు విద్యార్థులపై ఒత్తిడి తీసుకురావద్దని షరతు విధించిందని పేర్కొన్నారు.
ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది రాహుల్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. రీయింబర్స్‌మెంట్‌లో కేంద్రం వాటా కూడా ఉన్నదని, అయితే ఆ కేంద్రం నిధులను చెల్లించకుండా ముందుగా రాష్ట్ర ప్రభుత్వ వాటాను చెల్లించాలని సూచిస్తున్నదని పేర్కొన్నారు. దీంతో మొత్తం భారం రాష్ట్ర ప్రభుత్వంపై పడుతున్నదని తెలిపారు. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయడానికి రెండు వారాల గడువు కావాలని కోరారు. అంత గడువు ఇవ్వలేమని స్పష్టంచేసిన న్యాయమూర్తి.. నిర్దిష్ట తేదీ చెప్పాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను గురువారానికి వాయిదా వేశారు.