హైదరాబాద్, జనవరి 6 (నమస్తే తెలంగాణ): ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని షెడ్యూల్డ్ కులాల అభివృద్ధిశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆదేశించారు. బాధితులకు సత్వరం న్యాయం అందించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక, పౌరహక్కుల పరిరక్షణ చట్టాల అమలుపై ఉన్నతస్థాయి విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ సమావేశం మాసబ్ ట్యాంక్‌లోని దామోదరం సంజీవయ్య సంక్షేమభవన్‌లో గురువారం నిర్వహించారు. ఇందులో పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో చట్టాల అమలు తీరును, బాధితులకు రూ.100 కోట్ల పరిహారం ఇవ్వటాన్ని కేంద్ర సామాజిక న్యాయశాఖ మంత్రి రాందాస్ అథవాలే ప్రశంసించారని తెలిపారు. బాధితుల నుంచి ఫిర్యాదు అందిన వెంటనే కేసు నమోదు చేయాలని, డీఎస్పీలు త్వరితగతిన విచారణ పూర్తి చేసి చార్జిషీట్లు వేసేలా చూడాలని ఆదేశించారు. వరుస నేరాలకు పాల్పడే వారిపై రౌడీషీట్ తెరవాలని సూచించారు. ఈ చట్టాల పరిధిలోకి వచ్చే నేరాలకు పాల్పడితే విధించే కఠిన జైలుశిక్షల గురించి ప్రజల్లో అవగాహన పెంచేందుకు జిల్లాలలోని పోలీస్స్టేషన్లు, ప్రభుత్వ కార్యాలయాలు, న్యాయస్థానాల వద్ద బోర్డులు ఏర్పాయాలని తెలిపారు. ప్రతి నెలా 30వ తేదీన జిల్లాల్లో నిర్వహించే పౌరహక్కుల పరిరక్షణ దినోత్సవానికి కలెక్టర్, ఎమ్మెల్యేలు, ఎస్పీ తదితర అధికారులు తప్పకుండా హాజరయ్యేలా చూడాలని సూచించారు. స్టేలు విధించిన కేసులపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖలు రాయాలని, విక్టిమ్ రిలీఫ్ మానిటరింగ్ విభాగాన్ని పోలీస్ చీఫ్ కార్యాలయంలో కాకుండా బయట ఏర్పాటు చేస్తే బాగుంటుందని, ఈ విషయాన్ని డీజీపీ దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. సమావేశంలో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండా శ్రీనివాస్, ఐఏఎస్ అధికారులు విజయ్‌కుమార్, యోగితారాణా, క్రిస్టినా చోంగ్తూ, డీఐజీ శ్రీనివాసరావు, ఎస్సీ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ కరుణాకర్, దివ్యాంగుల ఆర్థిక సహకార సంస్థ కమిషనర్ శైలజ తదితరులు పాల్గొన్నారు.