Telangana | ఆయనో రాష్ట్ర మంత్రి! ‘బాంబు’ల్లాంటి మాటలకు ఫేమస్. తరచూ వివాదాల్లో చిక్కుకునే ఆయన.. ఈసారి మాత్రం తన తనయుడి నిర్వాకంతో మరోసారి వివాదంలో నిలిచారు. వందల కోట్ల ఆస్తితో హైదరాబాద్‌లోనే ఓ సంపన్నుడిగా నిలిచిన సదరు ‘మంత్రి గారి కుమారుడు’.. వివాదాల్లో తానేమీ తక్కువ కాదని పదే పదే నిరూపించుకుంటున్నారు. తాజాగా ఆయనపై ఓ హత్యాయత్నం కేసు నమోదయ్యే దాకా వెళ్లిన ఉదంతం.. ఇప్పుడు ప్రభుత్వ, అధికార వర్గాల్లో కలకలం రేపుతున్నది. భూ కబ్జాలు, వాటికోసం సాగిస్తున్న దౌర్జన్యాల్లో ‘ఖద్దరు రౌడీ’లుగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ నాయకుల తీరుకు ఈ ఘటన అద్దంపడుతున్నది. భూముల వెంపర్లాటలో కాంగ్రెస్ నేతలు సాగిస్తున్న నిత్య దౌర్జన్యాల్లో ఇదీ ఒకటి.
గండిపేటలో మూడ్రోజుల క్రితం ప్రైవేటు వ్యక్తులకు చెందిన భూమిని చెరపట్టేందుకు యత్నించారు మంత్రి గారి పుత్రరత్నం. విలువైన భూమిని కబ్జా చేయడమేకాకుండా అడ్డుకున్న వారిపైనా దౌర్జన్యానికి దిగారు. 70 మందికి పైగా బౌన్సర్లను దింపి.. ‘బీహార్ గ్యాంగ్’ తరహాలో పేట్రేగిపోయారు. స్థలంలోని ప్రహరీని కూల్చేసి, బీభత్సకాండ సృష్టించారు. భూ యజమానుల పైనా దాడిచేశారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని, పోలీసులను ఆశ్రయించిన బాధితులు.. తమపై హత్యాయత్నం చేశారని ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఆ కాంగ్రెస్ నేత మూకను తరిమి కొట్టారు. అయితే.. ఆఖరి నిమిషంలో రంగం లోకి దిగిన ముఖ్యనేత.. సాహసం ప్రదర్శించిన పోలీస్ అధికారిని అభినందించాల్సిందిపోయి.. ఆయనపై వేటుకు ఒత్తిడి తెచ్చారు.
హైదరాబాద్, సిటీబ్యూరో/ మణికొండ డిసెంబర్ 2 (నమస్తే తెలంగాణ) : రాష్టంలో భూ దందా హద్దులు దాటిపోయింది. విలువైన భూముల్లో గద్దల్లా వాలిపోతున్న పెద్దలు తాము అనుకున్న దానికోసం ఎంతకైనా తెగిస్తున్నారు. అడ్డం అనుకున్న వాళ్లను, అడ్చొచ్చిన వాళ్లను నిర్దాక్షిణ్యంగా అడ్డు తొలగించేందుకూ వెనుకాడటం లేదు. నాడు హిరణ్యాక్షుడు భూమిని చుట్టచుట్టుకొని ఎత్తుకుపోవాలనుకున్నట్టు.. నేడు ప్రభుత్వ పెద్దలు అధికార బలంతో హైదరాబాద్ శివారు భూములను మడత పెట్టేందుకు బరితెగిస్తున్నారు. తాజాగా బాంబుల మంత్రి కొడుకు గండిపేట చిట్టడవిలో విలువైన భూమిని చుట్టచుట్టేందుకు ప్రయత్నించి పోలీసులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డట్టు అత్యంత విశ్వసనీయంగా తెలిసింది. తనకు నచ్చిన భూమి కబ్జాకు అడ్డం పడుతున్నాడని ఆగ్రహించి ప్రభుత్వంలో నంబర్-2గా పేరున్న మంత్రి కొడుకు బీహార్ తరహా గ్యాంగ్‌తో దాడికి పాల్పడ్డట్టు తెలిసింది.
చివరికి ఈ వ్యవహారం హత్యాయత్నం కేసుల నమోదు దాకా వెళ్లడంతో ముఖ్యనేత ఆగ్రహంతో ఊగిపోయినట్టు సమాచారం. మంత్రి కొడుకుపై కేసులు నమోదు చేయడానికి సాహసించిన పోలీసు ఉన్నతాధికారిపైనే తక్షణం వేటు వేయడానికి సిద్ధమైనట్టు అత్యంత విశ్వసనీయంగా తెలిసింది. ఇప్పటికిప్పుడు ఉన్నతాధికారి మీద వేటు అంటే ప్రతిపక్ష పార్టీల చేతికి ఆయుధం ఇచ్చినట్టవుతుందని సన్నిహిత వర్గాలు సూచించడంతో తన ప్రయత్నాన్ని తాత్కాలికంగా విరమించుకున్నట్టు సమాచారం. విషయం తెలుసుకున్న ‘నమస్తే తెలంగాణ’ ప్రతినిధులు నిజానిజాలు తెలుసుకునేందుకు సంబంధిత పోలీసు అధికారులను సంప్రదించగా జరిగిన ఘటనను ధ్రువీకరించారు. కానీ, ఎవరిపై ఏఏ సెక్షన్లు పెట్టారో చెప్పడానికి నిరాకరించారు.
ప్రత్యక్ష సాక్షులు, పోలీసు వర్గాలు చెప్పిన దాని ప్రకారం.. గండిపేట రెవెన్యూ మండల పరిధిలోని వట్టినాగులపల్లిలో సర్వేనంబర్ 245లో పల్లవిషాకు సంబంధించి మూడెకరాల భూమి ఉన్నది. ఈ భూమికి పక్కనే ఉన్న సర్వే నంబర్ 259లో అవినాశ్, మరికొందరి భూమి ఉన్నది. ఈ భూమిలో మంత్రికి చెందిన కన్స్ట్రక్షన్ కంపెనీ డెవలప్మెంట్ అగ్రిమెంట్ కుదుర్చుకున్నది. అగ్రిమెంట్లో ఉన్నట్టుగా క్షేత్రస్థాయిలో భూ విస్తీర్ణం లేకపోవడంతో దాన్ని పూర్తి చేసుకోడానికి పక్క సర్వేనంబర్ 245లోని భూమిలోకి ఎలాంటి సమాచారం లేకుండా కన్స్ట్రక్షన్ కంపెనీకి చెందిన వ్యక్తులు ప్రవేశించి, ప్రహరీని కూల్చివేసినట్టు తెలిసింది. మంత్రి కొడుకు తన భూమిని కబ్జా పెడుతున్నారనే విషయం తెలుసుకున్న భూ యజమాని ఘటనా స్థలానికి వచ్చి వారిని అడ్డగించినట్టు సమాచారం. ఆ భూమి తమకే ఇవ్వాలని లేకుంటే అంతు చూస్తానంటూ భూ యజమానిని బెదిరించినట్టు తెలిసింది. దీంతో భయపడిన యజమాని కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని హైకోర్టును ఆశ్రయించారు. తన భూమిని ఆక్రమిస్తున్నారంటూ సంబంధిత పత్రాలను సాక్ష్యంగా సమర్పించి హైకోర్టులో స్టే తెచ్చుకున్నారు.
శనివారం అర్ధరాత్రి సుమారు 70 మంది బౌన్సర్లతో కలిసి కన్స్ట్రక్షన్ కంపెనీకి చెందిన ఇద్దరు డైరెక్టర్లు సర్వేనంబర్ 245లోని మూడెకరాల భూమిలో అక్రమంగా ప్రవేశించినట్టు సమాచారం. భూమి చుట్టూ ఉన్న ప్రహరీని కూల్చి స్థలాన్ని ఆక్రమించినట్టు తెలిసింది. అందులోనే ఉన్న గోశాలను మొత్తం నేలమట్టం చేసి అక్కడి సెక్యూరిటీపై దాడిచేయడంతో బాధితుడు సైబరాబాద్ పోలీసు ఉన్నతాధికారికి ఫోన్ ద్వారా ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. ఆయన సంబంధిత పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని సూచించగా స్థానిక పోలీసుల నుంచి స్పందన లేకపోవటంతో మరోసారి ఉన్నతాధికారికే ఫోన్ చేసి చెప్పినట్టు సమాచారం. దీంతో నేరుగా ఆయనే దాదాపు 120 మంది పోలీసు బందోబస్తుతో వచ్చి బౌన్సర్లను అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. అదే గ్రౌండ్లో వారిని నిలబెట్టి ట్రీట్మెంట్ ఇచ్చినట్టు సమాచారం. గచ్చిబౌలి పోలీసు స్టేషన్‌కు తీసుకువచ్చి మరోసారి బౌన్సర్లకు పోలీస్ ైస్టెల్లో ట్రీట్మెంట్ ఇచ్చినట్టు చర్చించుకుంటున్నారు. తానే దగ్గర ఉండి బౌన్సర్లను తీసుకొని వెళ్లి దాడికి పాల్పడిన మంత్రి కొడుకు, ఆయన కుటుంబ సభ్యుల మీద హత్యాహత్నం కేసు నమోదు చేసేందుకు పోలీసులు సిద్ధమైనట్టు తెలిసింది.
తన కొడుకు మీద పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేస్తున్నారన్న విషయం తెలుసుకున్న సదరు మంత్రి, హుటాహుటిన ముఖ్యనేత వద్దకు వెళ్లినట్టు తెలిసింది. తన కొడుకు, కుటుంబ సభ్యులపై పోలీసులు కేసు నమోదు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసినట్టు సమాచారం. తనకు తెలియకుండా పోలీసులు మంత్రి కొడుకు, ఆయన కుటుంబ సభ్యుల మీద కేసు నమోదు చేయడానికి సిద్ధమైన పోలీసు ఉన్నతాధికారిపై ముఖ్యనేత సీరియస్ అయినట్టు తెలిసింది. తమ మీదనే చట్టం ప్రయోగించడానికి సాహసించిన పోలీసు ఉన్నతాధికారి మీద తక్షణం వేటు వేయాలని ఆయన పోలీసు బాస్‌ను ఆదేశించినట్టు తెలిసింది. పోలీసు శాఖలో అత్యంత సమర్థుడు, నిజాయితీపరుడిగా పేరున్న ఉన్నతాధికారి మీద ఆకస్మికంగా వేటు వేస్తే ప్రతిపక్షాలకు ఆయుధంగా మారుతుందని ముఖ్యనేత సన్నిహితులు సూచించడంతో తాత్కాలికంగా వెనక్కి తగ్గినట్టు విశ్వసనీయ సమాచారం. ముఖ్యనేత సీరియస్ కావడంతో పునరాలోచనలో పడిన సదరు ఉన్నతాధికారి దీన్ని సాధారణ కేసుగా నమోదు చేయాలని దిగువ శ్రేణి అధికారులకు సూచించినట్టు తెలిసింది. దీంతో బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. మరోవైపు ఇదే విషయంలో కన్స్ట్రక్షన్ కంపెనీకి చెందిన వ్యక్తులు కూడా ఇచ్చిన ఫిర్యాదుతో ఇరువర్గాలపై పోలీసులు కేసులు నమోదు చేసినట్టు తెలిసింది.