Praveen Reddy | (స్పెషల్ టాస్క్బ్యూరో) కోట్ల రూపాయల ధర పలికే ప్రభుత్వ భూమిని చెరబడుతున్నారని, ఇవిగో ఆధారాలు అంటూ ‘నమస్తే తెలంగాణ’ సంచలనాత్మక కథనం ప్రచురిస్తే, దానిపై విచారణ జరిపి ఆ భూమిని రక్షించాల్సింది పోయి ఆ విషయాన్ని ప్రజల ముందుంచిన నమస్తే తెలంగాణ దినపత్రికపై కక్ష సాధింపు చర్యలకు రేవంత్ సర్కార్ దిగడం విడ్డూరంగా ఉంది. సాధారణంగా ప్రభుత్వ భూమి కబ్జాకు గురవుతున్నదన్న సమాచారం తెలిస్తే సంబంధిత రెవెన్యూ అధికారులు రంగంలోకి దిగి ఆ భూమిపై లోతుగా విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటారు. సదరు ఆక్రమణదారులపై కేసులు నమోదు చేయిస్తారు. కానీ ఇక్కడ అది జరగలేదు. నమస్తే తెలంగాణ కథనాన్ని ఆధారంగా చేసుకుని మీర్‌పేట పోలీసులకు రెవెన్యూ అధికారులు ఫిర్యాదు చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.
పోలీసులు రెవెన్యూ అధికారుల ఫిర్యాదును ఏమాత్రం పట్టించుకోలేదు. అంతేకాదు, బాలాపూర్ ఎమ్మార్వో ఇచ్చిన ఫిర్యాదు కాపీలో అతుల్యం హోమ్స్ డైరెక్టర్ ప్రవీణ్‌రెడ్డి పేరును పొందుపర్చినా సదరు వ్యక్తిని పోలీసులు విచారణకు పిలవకుండా చోద్యం చూడటం అనుమానాలకు తావిస్తున్నది. ఎమ్మార్వో ఫిర్యాదు కాపీలో ప్రవీణ్‌రెడ్డి పేరును మార్చి మరీ ఫిర్యాదును పోలీసులు తారుమారు చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇంత పెద్ద వ్యవహారంలో రెవెన్యూ అధికారులే కీలకంగా వ్యవహరించాల్సి ఉంటుంది. కానీ వారిని పక్కనెట్టి ‘నవ్విపోదురుగాక నాకేమి సిగ్గు’ అన్న చందంగా పోలీసులే తమ చేతుల్లోకి తీసుకుని పెద్ద తలకాయల సూచనలు అమలు చేస్తున్నారు. ఇటువంటి వికృత భూ క్రీడ వెనక ఉన్న ఆ అదృశ్య శక్తులకు కొమ్ముకాస్తున్నారు.
విచారణ శూన్యం..ఆ రహస్యమేంటి?
అది రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం నాదర్గుల్ గ్రామంలో సర్వే నంబర్ 92లో సుమారు 291.32 ఎకరాల ప్రభుత్వ భూమి. ఈ భూమిని ల్యాండ్ పూలింగ్ చేసి ఓ కంపెనీ మాటున చెర పట్టేందుకు బిగ్ బ్రదర్స్ ప్రణాళిక రూపొందించారు. ఈ వ్యవహారాన్ని నమస్తే తెలంగాణ గురువారం వెలుగులోకి తీసుకొచ్చింది. సమాంతర వ్యవస్థగా ఏర్పడి భూములకు ఎన్వోసీ, పాస్ పుస్తకాలు తెస్తామంటూ అతుల్యం హోమ్స్ డైరెక్టర్ ప్రవీణరెడ్డి పేరిట రైతులతో ఒప్పందాన్ని కూడా పూర్తయిన వైనాన్ని ఆధారాలతో సహా ప్రచురించింది. కానీ 292.32 ఎకరాల ల్యాండ్ పూలింగ్ ప్రక్రియను తప్పుదోవ పట్టించేందుకు, దీని వెనక ఉన్న సూత్రధారులను కాపాడేందుకు పోలీసులు నిబంధనలకు విరద్ధంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
సర్కార్ భూమి కబ్జాకు గురవుతున్నదంటూ బాలాపూర్ ఎమ్మార్వో ఫిర్యాదు చేసినా ఆ మేరకు విచారణ జరపకుండా అంతా గప్‌చుప్ అయ్యేలా పరిస్థితులను మార్చేశారు. ఇదంతా పై శక్తుల కనుసన్నల్లోనే జరిగింది. నమస్తే తెలంగాణ కథనం ప్రచురితం కావడంతో పావులు కదిపిన అదృశ్య శక్తులు.. పోలీసులకు ఏం చెయ్యాలో సూచనలు అందించినట్టు తెలిసింది. దీంతో వారి ఆదేశాల మేరకు ఎమ్మార్వో ఫిర్యాదులో ఉన్న ఆ కంపెనీ డైరెక్టర్ పేరును తొలగించారు. ఎఫ్ఐర్ కాపీలో అన్నోన్ పర్సన్ అంటూ పేరు మార్చించారు. దీంతో ప్రభుత్వ భూమిని కొల్లగొట్టేందుకు ప్రయత్నిస్తున్న వారిని పోలీసులే రక్షిస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి.
ఆ అదృశ్య శక్తులు ఎక్కడ?
కూపీ లాగితే డొంక కదిలేది. అందుకు నమస్తే తెలంగాణ కీలక ఆధారాలను సైతం పోలీసుల ముందుంచింది. బాలాపూర్ ఎమ్మార్వో ఫిర్యాదు పై విచారణ జరిపితే వందల కోట్ల విలువచేసే సర్కార్ భూములను చెరబట్టడానికి ప్రయత్నించి న ముఠా బాగోతం బయటపడేది. ముఠా వెనక ఉన్న ఆ పై శక్తులు ఎవరనేది తేలిపోయేది. ఎమ్మా ర్వో అందించిన మొదటి ఫిర్యాదు కాపీలో ప్రవీణ్‌రెడ్డి గుట్టు విప్పేలా కంపెనీ వివరాలు ఉన్నప్పటికీ పోలీసులు ఆ దిశగా విచారణ జరపలేదు. గూగుల్‌లో సైతం సదరు కంపెనీ ఫోన్ నంబర్లతో సహా వివరాలన్నీ ఉన్నాయి. వారిని పోలీసులు విచారిస్తే భూమాయ అధికారికంగా వెలుగులోకి వచ్చేది. కానీ ఆ విచారణ అలా జరగకుండా భక్షించే వారిని కాపాడాలనే దిశగా సాగడంతో ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ ఇప్పుడు అనేక అనుమానాలకు దారి తీసింది. ల్యాండ్ పూలింగ్ బాధ్యులు బయటకు వస్తే ఆ అదృశ్య శక్తుల దందా బహిర్గతమయ్యే పరిస్థితులు ఉండటంతో అసలుకే మోసం వస్తుందని గ్రహించిన సూత్రధారులు ల్యాండ్‌పూలింగ్ ప్రక్రియ జరగలేదనే వార్తలను ప్రచారం చేయించే పనిలో పడ్డారు. ఇందుకోసం కొంతమంది రైతులను పావులుగా వాడుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.