హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 11 (నమస్తే తెలంగాణ): వైద్య రంగంలో డయాగ్నోస్టిక్ సేవలు ఎంతో కీలకం. ఇందులో ప్రస్తుతం ఎన్నో సమస్యలు, సవాళ్లు ఎదురవుతున్నాయి. వీటిని సమర్థవంతంగా ఎదుర్కొని పరిష్కారం చూపే ఔత్సాహిక స్టార్టప్ నిర్వాహకులను ప్రోత్సహించేందుకు రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సర్కిల్ ఆఫ్ హైదరాబాద్ ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఔత్సాహికులు దరఖాస్తు చేసుకునేందుకు గడువును ఈనెల 25 వరకు పొడిగించారు. పలువురి విజ్ఞప్తి మేరకు 11వ తేదీ వరకు ఉన్న గడువును మరిన్ని రోజులు పెంచామని నిర్వాహకులు తెలిపారు. ఎంపికైన స్టార్టప్లకు ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ)లో ఉన్న డీ-ల్యాబ్స్ ఇంక్యూబేటర్లో స్థానం కల్పించనున్నారు. మెరుగైన డయాగ్నోస్టిక్ సేవలను అందుబాటులోకి తెచ్చే స్టార్టప్లకు అవసరమైన సహాయ సహాకారాలను అందించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఐఎస్బీకి చెందిన పూర్వ విద్యార్థులు సుమారు 60కిపైగా దేశాల నుంచి తమ సహకారాన్ని అందించనున్నారు. ఔత్సాహికులు https://t.co/IyplDS2pAo లో దరఖాస్తు చేసుకోవాలని నిర్వాహకులు సూచించారు.