హైదరాబాద్, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వశాఖల్లో కొత్త పోస్టుల మంజూరు విషయంలో సర్కారు కొత్త మెలికపెట్టింది. పాత పోస్టులను రద్దు చేసుకుంటేనే.. కొత్త పోస్టులిస్తామంటున్నది. పంచాయతీరాజ్‌శాఖలో 165 పోస్టులను రద్దుచేశారు. ఈశాఖలో 6,884 పోస్టులుంటే రద్దుచేసిన తర్వాత మొత్తం పోస్టుల సంఖ్య 6,719కు చేరింది. మిగతా శాఖల్లోనూ ఇదే పరిస్థితి నెలకొన్నది. రాష్ట్రంలో కొత్త జిల్లాలు, మండలాలు, జోన్లు ఏర్పాటయ్యాయి. ఒక ఉమ్మడి జిల్లా ఆరు, ఐదు జిల్లాలయ్యాయి. పైగా ఉద్యోగుల రిటైర్మెంట్లు ఊపందుకున్నాయి. దీంతో పలుశాఖల్లో కొత్త పోస్టులను మంజూరుచేయాల్సి ఉంది. కానీ పోస్టులను మంజూరు చేయకపోవడంతో పలుశాఖల్లో పోస్టుల కొరత సమస్య వేధిస్తున్నది.
దీంతో ఒక్కరే రెండు, మూడు పోస్టుల్లో అదనపు బాధ్యతలు నిర్వహించాల్సి వస్తున్నది. పరిస్థితి ఇలా ఉంటే ప్రభుత్వం మాత్రం పాత పోస్టులను రద్దుచేస్తేనే కొత్త పోస్టులిస్తామంటున్నది. అయితే రద్దు చేసేవి కాలం చెల్లిన, అవసరంలేని పోస్టులేనని సమాచారం. తాజాగా 30వేల కొత్త పోస్టులు అవసరమవుతాయని ఉద్యోగ సంఘాలంటున్నాయి. ఒక్క పాఠశాల విద్యాశాఖలోనే రెండు మల్టీజోన్లకు అడిషనల్ డైరెక్టర్ పోస్టులు, జాయింట్ డైరెక్టర్ పోస్టులు 5, డిప్యూటీ డైరెక్టర్ పోస్టులు 6, డీఈవో 21, డిప్యూటీ ఈవో 150, డైట్‌కాలేజీల్లో 265, ఇతర కాలేజీల్లో మరో 129 పోస్టులు అవసరమవుతాయని సంఘాల నేతలు అంటున్నారు.