కవాడిగూడ, మే 15 : మత్స్యకారులకు వృత్తిరక్షణ, ఉపాధి, జీవిత భద్రత కల్పించాలని తెలంగాణ మత్స్యకారులు, మత్స్యకార్మిక సంఘం డిమాండ్ చేసింది. సమస్యల పరిష్కారంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి పెట్టాలని సంఘం ప్రతినిధులు కోరారు. ఈ మేరకు గురువారం ఇందిరాపార్క్ వద్ద మహాధర్నా నిర్వహించారు. ధర్నాలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గోరెంకల నర్సింహ, ప్రధాన కార్యదర్శి లెల్లెల బాలకృష్ణ, రాష్ట్ర నాయకుడు పిట్టల రవీందర్ పాల్గొన్నారు.
దేశంలో 5 కోట్ల మంది మత్స్యకారవృత్తిపై ఆధారపడి ఉపాధి పొందుతున్నారని, చేపలు, రొయ్యల ఎగుమతితో దేశానికి కోట్లాది రూపాయల ఆదాయం వస్తున్నదని చెప్పారు. ప్రాణాలు పణంగా పెట్టి చేపల వేటకు వెళ్తున్న మత్స్యకారుల జీవిత భద్రత కోసం బీమా, పరిహారం వంటి పథకాలు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. కేంద్రప్రభుత్వం నాబార్డు ద్వారా మత్స్యకారులకు ఇచ్చే రుణాలను నిలిపివేసిందని ఆవేదన వ్యక్తంచేశారు. రిజర్వాయర్లు, జలవనరులను మత్స్యకారులకు దూరం చేసి, కార్పొరేట్ సంస్థలకు అప్పగిస్తున్నారని వారు విమర్శించారు.