నంగునూరు, మే 29: ‘అధికారంలోకి వచ్చి ఉయ్యాలో.. హామీల అమలు మరచి ఉయ్యాలో’.. అంటూ ఉపాధి హామీ కూలీలు రాష్ట్ర ప్రభుత్వంపై నిరసన గళం వినిపించారు. హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ సర్కార్ విఫలమైందంటూ సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం కొండంరాజుపల్లిలో శుక్రవారం ఉపాధి హామీ కూలీలు పని చేస్తున్న ప్రదేశంలోనే విరామ సమయంలో బతుకమ్మ ఆట పాట రూపంలో నిరసన తెలిపారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ఉయ్యాల పాటలు పాడారు. మకలు, వడ్ల కొనుగోలులో అధికారుల వైఫల్యాన్ని, కొనుగోలు కేంద్రాల్లో పేరుకుపోయిన ధాన్యంతో రైతులు పడుతున్న కష్టాలను, మిల్లర్లు ధాన్యం దిగుమతి చేసుకోక పోవడంతో కష్టనష్టాలను పాటగా మార్చి బతుకమ్మ ఆడారు. రైతుబంధు వేయకపోవడం, ధాన్యానికి బోనస్ ఇవ్వక పోవడం, రైతు రుణమాఫీ పూర్తి స్థాయిలో కాకపోవడాన్ని పాట రూపంలో ఏకరువు పెట్టారు. ఎన్నికల ముందు అదిగిచ్చి బుదిగిచ్చి కాంగ్రెస్ పార్టీ ఓట్లు వేయించుకుందని విమర్శించారు. అధికారంలోకి వచ్చాక వాటిని అమలు చేయడం లేదని వాపోయారు. హామీలను నమ్మి ఓటేయడంతో ఎన్నడూ రాని కష్టాలు వచ్చాయని నిరసన తెలిపారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.