హైదరాబాద్, ఆగస్టు 27 (నమస్తే తెలంగాణ) : ‘నేను ఏసీబీ అధికారిని, హైదరాబాద్ హెడ్ ఆఫీసు నుంచి మాట్లాడుతున్నా. మీరు లంచం తీసుకుంటున్నట్టు మా దృష్టికి వచ్చింది. కొంత డబ్బిస్తే మీపై కేసు కాకుండా చూస్తాం’ అంటూ ప్రభుత్వ ఉద్యోగులకు కొందరు నకిలీగాళ్లు కాల్స్ చేయడంతో కొందరు భయపడిపోయి డబ్బులు సమర్పించుకున్నారు. మరికొందరు ఏసీబీ డీజీ సీవీ ఆనంద్‌కు ఫిర్యాదు చేశారు.
డీజీ ఫేక్‌కాల్స్‌పై ప్రకటన విడుదల చేశారు. ఏసీబీ అధికారుల పేరుతో ఫేక్ కాల్స్ వస్తే అధికారులు, ప్రజలు స్పందించవద్దని చెప్పారు. ఏసీబీ అధికారులు అటువంటి కాల్స్ చేయరని స్పష్టం చేశారు. ఎవరైనా ఫేక్ కాల్స్‌తో బెదిరిస్తే.. ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064ను సంప్రదించి, స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని సూచించారు. వరంగల్ ఏసీబీ విభాగం స్థానిక పోలీసులతో కేసు దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.