హైదరాబాద్, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని వరద బాధితులకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు బాసటగా నిలిచారు. ఒకరోజు మూల వేతనాన్ని విరాళంగా ఇస్తామని ఉద్యోగుల జేఏసీ సంఘాలు మంగళవారం ప్రకటించాయి. హైదరాబాద్ నాంపల్లిలోని టీఎన్జీవో భవన్లో ఎంప్లాయీస్ జేఏసీ నేతలు అత్యవసరమై వరద బాధితుల సాయంపై చర్చించారు. 205 సంఘాలతో కూడిన జేఏసీ పక్షాన రూ.130 కోట్లను సీఎం సహాయనిధికి జమచేయాలని తీర్మానించారు. ఆ తర్వాత మహబూబాబాద్‌కు వెళ్లిన జేఏసీ నేతలు అక్కడి జిల్లా కలెక్టరేట్లో సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి తమ అంగీకారపత్రాన్ని అందజేశారు. రాష్ట్రంలోని గెజిటెడ్ అధికారులు, ఉపాధ్యాయులు, కార్మికులు పెన్షనర్లు, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల ఒక రోజు మూలవేతనాన్ని సెప్టెంబర్ నెల జీతం నుంచి ప్రభుత్వ ఖజానాకు జమచేయాలని కోరారు. ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్ జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ శ్రీనివాసరావు, శ్రీపాల్‌రెడ్డి, సదానందంగౌడ్, మధుసూదన్‌రెడ్డి, స్థితప్రజ్ఞ, చంద్రశేఖర్‌గౌడ్, రవీందర్‌రెడ్డి, రవి, మణిపాల్‌రెడ్డి, రమేశ్, సత్యనారాయణ పాల్గొన్నారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ): వరద బాధితులకు తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ పక్షాన రూ.100 కోట్ల విరాళాన్నిస్తున్నట్టు జేఏసీ చైర్మన్ వీ లచ్చిరెడ్డి ప్రకటించారు. ఈ మేరకు మంగళవారం సచివాలయంలో సీఎస్ శాంతికుమారిని కలిసి జేఏసీ పక్షాన ఉద్యోగుల అంగీకారపత్రాన్ని అందజేశారు. ప్రభుత్వ విభాగాల్లోని ఉద్యోగుల తరఫున సమష్టిగా ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఈ క్లిష్ట సమయంలో తమ వంతుగా ప్రభుత్వానికి ఆర్థికంగా చేయూతనివ్వాలని భావించినట్టు లచ్చిరెడ్డి తెలిపారు.