హైదరాబాద్, ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ): ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల సమస్యల పరిష్కారంలో సర్కార్ అలసత్వాన్ని నిరసిస్తూ ఆందోళనలు చేస్తామని తెలంగాణ ఎంప్లాయీస్ జేఏసీ పునరుద్ఘాటించింది. జూన్ 2లోపు 51% ఫిట్మెంట్తో పీఆర్సీ ప్రకటించాలని సర్కార్‌కు అల్టిమేటం జారీచేసింది.
ఈ మేరకు జేఏసీ నేతలు శుక్రవారం సచివాలయంలో సీఎస్ కే రామకృష్ణారావును కలిసి ఉద్యమ కార్యాచరణ నోటీసు అందజేశారు. ఈ నెల 17న నల్లబ్యాడ్జీలు ధరించి జిల్లా, మండల, డివిజన్ కేంద్రాలతోపాటు హైదరాబాద్‌లోని హెచ్‌వోడీ కార్యాలయాలు, సచివాలయంలో నిరసనలు తెలుపనున్నట్టు జేఏసీ నేతలు ప్రకటించారు.
ఉద్యోగుల పెండింగ్ బిల్లులు రూ.13 వేల కోట్లను ఏకమొత్తంగా విడుదల చేయాలని ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ఈహెచ్ఎస్ కార్డుల జారీలో ఆలస్యంపై నిరసన వ్యక్తంచేశారు. మే 1వ తేదీ నుంచి వర్తించేలా హెల్త్‌కార్డులు జారీ చేయాలని కోరారు.
సీపీఎస్‌ను రద్దుచేసి పాత పింఛన్ అమలుచేయాలని, వీటితోపాటు 64 డిమాండ్లు పరిష్కరించాలని కోరారు. సీఎస్‌ను కలిసిన వారిలో పుల్గం దామోదర్‌రెడ్డి (పీఆర్టీయూటీఎస్), బీ శ్యామ్(టీజీవో), జీ సదానందంగౌడ్(ఎస్టీయూ టీఎస్), కటకం రమేశ్(టీఆర్టీఎఫ్), పీ వెంకట్‌రెడ్డి (పెన్షనర్స్), రామారావు, జుట్టు గజేందర్, పర్వత్‌రెడ్డి తదితరులు ఉన్నారు.