పాల్వంచ, జూన్ 24: యావత్ దేశంలో ఒక్క తెలంగాణలోనే 24 గంటలపాటు విద్యుత్తు సరఫరా అవుతున్నదని టీఎస్ జెన్కో, ట్రాన్స్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు అన్నారు. భద్రాద్రి జిల్లా పాల్వంచలోని కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ ప్రాంగణంలో రూ.12 కోట్ల వ్యయంతో నిర్మించిన టీఎస్ జెన్కో శిక్షణా కేంద్రంతోపాటు రూ.18 కోట్ల వ్యయంతో నిర్మించిన వసతి గృహాలను శనివారం ఆయన ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుతో కలిసి ప్రారంభించారు.
దేవులపల్లి మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పాటైన కొత్తలో రోజుకు కేవలం 7,778 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి అయ్యేదని, సీఎం కేసీఆర్ విజన్‌తో ఆ ఉత్పత్తిని 18,565 మెగావాట్లకు పెంచినట్టు చెప్పారు. యాదాద్రి పవర్‌ప్లాంట్ పూర్తి చేసి ఈ ఉత్పత్తిని మరో 4 వేల మెగావాట్లకు పెంచనున్నట్టు తెలిపారు. సీఎం కేసీఆర్ కృషితోనే రాష్ట్రంలో చీకట్లు మాయమైనట్టు పేర్కొన్నారు. విద్యుత్తు ఉత్పత్తి విషయంలో దేశంలో ఏ రాష్ట్రమైనా తెలంగాణను ఆదర్శంగా తీసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కేరళకు చెందిన విద్యుత్తు శాఖ అధికారులు ఇటీవల తెలంగాణకు వచ్చి విద్యుత్తు ఉత్పత్తి, గ్రిడ్ వ్యవస్థతోపాటు విద్యుత్తు రంగంలో సంస్కరణల గురించి తెలుసుకోవడమే ఇందుకు నిదర్శనమని అన్నారు.