గంగాధర, మార్చి 31 : ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి కరీంనగర్ జిల్లా గంగాధర మండలం సర్వారెడ్డిపల్లి శివారులో నారాయణపూర్ రిజర్వాయర్‌కు గోదావరి జలాలను తరలించే ఎల్లంపల్లి పైపులైన్‌ను గుర్తుతెలియని వ్యక్తులు సోమవారం రాత్రి ధ్వంసం చేశారు. పైపులైన్ లీక్ కావడంతో పెద్ద ఎత్తున వరద పొలాల్లోకి పోటెత్తింది. సుమారు 50 ఎకరాల్లో వరి పంట నీట మునిగింది. మంగళవారం తెల్లవారుజామున అటుగా వెళ్లిన గ్రామ రైతులు గుర్తించి లబోదిబోమన్నారు. పొట్టకు వచ్చిన దశలో పొలాలు నీటమునగడం చూసి ఆందోళన వ్యక్తంచేశారు.
ఈ విషయాన్ని వెంటనే ఎల్లంపల్లి ప్రాజెక్టు డీఈ జిలానికి తెలుపగా, ఆయన అధికారులతో కలిసి అక్కడికి చేరుకున్నారు. పైపులైన్ ధ్వంసమైన ప్రదేశాన్ని పరిశీలించారు. దీనిపై విచారణ చేస్తామని, ధ్వంసమైన పైపులైన్‌కు మరమ్మతులు చేయిస్తామని తెలిపారు. అయితే పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నందిమేడారం పంప్‌హౌస్ వద్ద మోటర్లను ఆపితే ఇక్కడ నీరు ఆగిపోతుంది.. కానీ రాత్రి వరకు కూడా ఆపకపోవడంతో నీరంతా వృథాగా పొలాల్లోకి చేరుతూనే ఉండటంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.