హైదరాబాద్, సెప్టెంబర్ 10 (నమస్తే తెలంగాణ): పార్టీ ఫిరాయింపులపై హైకోర్టు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదని బీజేఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డి చెప్పారు. హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. పార్టీ ఫిరాయింపునకు పాల్పడిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని గతంలో తాము పిటిషన్ వేశామని, దీనిపై హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని తెలిపారు. అనర్హత పిటిషన్లను వెంటనే స్పీకర్ ముందుంచాలని, నాలుగు వారాల్లోగా షెడ్యూల్ నిర్ణయించాలని స్పీకర్ కార్యదర్శిని ఆదేశించడం చరిత్రాత్మకమని చెప్పారు. హైకోర్టు తీర్పును మంత్రి పొన్నం ప్రభాకర్ స్వాగతించడం మంచి పరిణామమని పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే దృష్టికి సీఎం రేవంత్‌రెడ్డి తీసుకెళ్లి తీర్పును గౌరవించేలా చొరవ చూపాలని సూచించారు.
రేవంత్‌రెడ్డి పీసీసీ చీఫ్‌గా ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు పార్టీ మారితే వారిండ్ల ముందు చావుడప్పు కొట్టమన్నారని, ఇప్పుడు ఆయనే అనైతికంగా ఇతర పార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకుంటున్నారని, ఇది ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. రాష్ట్రంలో నేతలు ఇందిరా కాంగ్రెస్, ఆర్ఆర్ కాంగ్రెస్‌గా విడిపోయారని, ఆర్ఆర్ కాంగ్రెస్‌కు ఏఐసీసీకి మధ్య సమన్వయలోపం నెలకొన్నదని చెప్పారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడే ఎమ్మెల్యేలను అసెంబ్లీ సభ్యత్వానికి అనర్హత వేటు వేస్తామని కాంగ్రెస్ మ్యానిఫెస్టోలోనే హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. ఇందిరా కాంగ్రెస్ నిర్ణయాలు అర్‌అర్ కాంగ్రెస్ అమలు చేయదా? అని ప్రశ్నించారు. పీఏసీ చైర్మన్ విషయంలోనూ సంప్రదాయాలకు విరుద్ధంగా పనిచేశారని విమర్శించారు. ఇతర పార్టీలో గెలిచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేను పీఏసీ చైర్మన్‌గా నియమించడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. పార్టీ మారిన మొత్తం 10 మంది ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
రేవంత్ పదవి దినదినగండం
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి పదవి దినదిన గండంగా మారిందని మహేశ్వర్‌రెడ్డి విమర్శించారు. పీసీసీ అధ్యక్ష పదవి ఆయన చెప్పిన వారికి ఇవ్వలేదని, హైకోర్టు తీర్పుపై మంత్రి పొన్నం వ్యాఖ్యలతో మంత్రులకు సీఎంకు మధ్య గ్యాప్ ఉందన్న విషయం బయటపడిందని తెలిపారు. ప్రభుత్వ పెద్దలు ప్రజలకిచ్చిన హామీలను, వరద బాధితులకు సాయం వదిలేసి, కలెన్షన్ల బిజీలో ఉన్నారని ఎద్దేవా చేశారు. ఆర్ ట్యాక్స్, ఆర్ఆర్ ట్యాక్స్, ఆర్ఆర్ఆర్ ట్యాక్స్, బీ ట్యాక్స్, యూ ట్యాక్స్ ఇలా కలెక్షన్లలో మునిగితేలుతున్నారని మండిపడ్డారు. హైడ్రా ఆరంభ శూరత్వమేనని, కావాలనే హైడ్రా కోరలను సీఎం పీకేశారని విమర్శించారు. కుటుంబ ఒత్తిళ్లు, ఒవైసీకి భయపడి హైడ్రాపై సీఎం వెనకి తగ్గారని, హైడ్రా వెనుక రూ.వందల కోట్లు చేతులు మారుతున్నాయని ఆరోపించారు.