Bhatti Vikramarka | హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 20 (నమస్తే తెలంగాణ): ‘రాష్ట్రంలో కరెంట్ కోతల్లేవు.. ఉన్నాయంటూ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు.’ అని మీడియా సమావేశంలో డిప్యూటీ సీఎం, విద్యుత్తు శాఖ మంత్రి భట్టి విక్రమార్క అసహనం వ్యక్తం చేసి 24 గంటలు తిరగక ముందే స్వయంగా ఆయనకే విద్యుత్తు కోత సెగ తగిలింది. శనివారం సాయంత్రం హైదరాబాద్ హి మాయత్నగర్లోని సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ నేతలతో భట్టి విక్రమార్క భేటీ అయ్యారు.
సమావేశం జరుగుతుండగా సాయంత్రం 6.45 గంటలకు సీపీఐ కార్యాలయంతోపాటు పరిసరాల్లో విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. కొద్దిసేపటి తర్వాత పరిసర ప్రాంతాల్లో కరెంటు వచ్చినా సీపీఐ ఆఫీస్కు మాత్రం రాలేదు. దీంతో భట్టి, సీపీఐ నేతలు పావుగంటకు పైగా చీకట్లోనే ఉండాల్సి వచ్చింది. దీనిపై విద్యుత్తు శాఖ అధికారులు ట్విట్టర్లో స్పందించారు. సీపీఐ ఆఫీస్లో విద్యుత్తు సరఫరాకు అంతరాయం కలిగిందని, సుమా రు 15 నిమిషాల్లోనే పునరుద్ధరించామని పోస్టు చేశారు.