హైదరాబాద్, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ): కొత్త జిల్లాల ఏర్పాటు.. అభివృద్ధి విస్తరణ, పారిశ్రామికీకరణ వేగవంతం కావడంతో రాష్ట్రంలో ఏటా విద్యుత్తుకు డిమాండ్ పెరుగుతున్నది. భవిష్యత్తులోను సాలీనా ఆరు శాతం విద్యుత్తు డిమాండ్ పెరుగనుంది. 2032 నాటికి రాష్ట్రంలో విద్యుత్తు పీక్ డిమాండ్ 27 వేల మెగావాట్లకు చేరుతుందని సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ (సీఈఏ) అంచనా వేసింది. 2023 -24లో పీక్ డిమాండ్ 15,704 మెగావాట్లుండగా, ఈ ఏడాది అది 16,877 మెగావాట్లకు చేరుతుందని సంస్థ అంచనా వేసింది. ఈ మేరకు మంగళవారం రిపోర్ట్ ఆన్ రిసోర్స్ అడిక్వసీ ప్లాన్ ఫర్ తెలంగాణ-2031-32 పేరుతో ఓ నివేదికను విడుదల చేసింది. రాష్ట్రంలో విద్యుత్తు అవసరాలు రానురాను పెరుగుతాయని, ఈ మేరకు రాష్ట్రంలో విద్యుత్తు సరఫరా వ్యవస్థలను ఏర్పాటు చేయాల్సిన అవసరముందని సంస్థ సూచించింది. విద్యుత్తు డిమాండ్ తీవ్రంకానున్న నేపథ్యంలో కరెంట్ ఉత్పత్తిని రెట్టింపు చేయాల్సి ఉంది. దీనిని ముందుగా గమనించిన గత కేసీఆర్ ప్రభుత్వం నాలుగు వేల మోగావాట్ల సామర్థ్యం గల యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్‌ను చేపట్టింది. గతంలోనే భదాద్రి పవర్‌ప్లాంట్‌ను అత్యంత వేగంగా అందుబాటులోకి తీసుకొచ్చింది. అంతేకాకుండా సౌర విద్యుత్తు వినియోగాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించింది.