హైదరాబాద్, ఫిబ్రవరి 15 (నమస్తే తెలంగాణ): కేంద్ర ప్రభుత్వ విద్యుత్తు సంస్కరణలపై సీఎం కే చంద్రశేఖర్‌రావు సంధించిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక బీజేపీ నేతలు వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారని విద్యుత్తు శాఖ మంత్రి జీ జగదీశ్‌రెడ్డి మండిపడ్డారు. కేసీఆర్‌పై చేసిన అనుచిత వ్యాఖ్యలను కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తక్షణమే ఉపసంహరించుకొని, ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దేశంలో సమాఖ్య స్ఫూర్తిని, రాజ్యాంగ విలువలను కాలరాస్తున్న దుర్మార్గ పార్టీ బీజేపీ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘కేసీఆర్ నిప్పులాంటి మనిషి. ఆయనను ముట్టుకుంటే మసైపోతారు’ అని హెచ్చరించారు. మంగళవారం టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, ప్రభుత్వ విప్ ఎమ్మెస్ ప్రభాకర్‌రావు, ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి, ఎమ్మెల్యే గాదరి కిశోర్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. విద్యుత్తు రంగం ప్రైవేటీకరణపై కేసీఆర్ స్పష్టమైన అవగాహనతో, ఆధార సహితంగా మాట్లాడితే, బండి సంజయ్, కిషన్‌రెడ్డి ఆత్మవంచన చేసుకొని మాట్లాడుతున్నారని మండిపడ్డారు. సంస్కరణల పేరుతో విద్యుత్తు రంగాన్ని ప్రైవేటుపరం చేయబోతున్నారని కేసీఆర్ చెప్పింది అక్షర సత్యమన్నారు. కేంద్రం గతేడాది ఏప్రిల్ 27 రాష్ర్టానికి పంపిన విద్యుత్తుపై పాలసీలో దశలవారీగా అన్ని రంగాల్లో ప్రీ పెయిడ్ మీటర్లు పెట్టాలని స్పష్టంగా ఉన్నదని తెలిపారు.
రాష్ట్రానికి బియ్యం ఇచ్చాం, నీళ్లిచ్చామని కిషన్‌రెడ్డి చెప్పటం హాస్యాస్పదమని జగదీశ్‌రెడ్డి ఎద్దేవా చేశారు. రాష్ర్టానికి రాజ్యాంగ హక్కుగా రావాల్సినవే వస్తున్నాయని, కేంద్రం భిక్ష కాదని అన్నారు. బీజేపీ నేతలకు దమ్ముంటే మిషన్ భగీరథ, మిషన్ కాకతీయకు నీతి అయోగ్ సిఫారసు చేసిన రూ.24 వేల కోట్లు, కాళేశ్వరానికి జాతీయ హోదా తీసుకురావాలని సవాలు చేశారు. విద్యుత్తు సంస్కరణలపై కిషన్‌రెడ్డి, సంజయ్‌తో చర్చకు సీఎం అవసరం లేదని, టీఆర్ఎస్ కార్యకర్త చాలని స్పష్టంచేశారు. విద్యుత్తు సంస్కరణల నష్టం ఏమిటో కిషన్‌రెడ్డి స్వగ్రామంలో ఎవరిని అడిగినా చెప్తారన్నారు. ప్రజలను మోసం చేసినందుకు బీజేపీ నేతలు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
2018 నుంచి ఇప్పటిదాకా ఏ రాష్ట్రంలోనూ కేసీఆర్ పథకాల ప్రస్తావన లేకుండా ఎన్నికలు జరగలేదని జగదీశ్‌రెడ్డి చెప్పారు. ఉచిత విద్యుత్తు, రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, మిషన్‌భగీరథ వంటి పథకాలను అనేక రాష్ర్టాల్లో పార్టీలు మ్యానిఫెస్టోల్లో పెట్టుకొన్నాయని గుర్తుచేశారు. కేసీఆర్ రోజురోజుకు దేశమం తా విస్తరిస్తున్నారనే అక్కసుతో బీజేపీ విషప్రచారం చేస్తుందని మండిపడ్డారు. 36 పార్టీలను ఏకం చేసి తెలంగాణ సాధించిన కేసీఆర్.. అదే స్ఫూర్తితో దేశాన్ని మేల్కొలిపేందుకు సిద్ధమయ్యారని చెప్పారు.