హైదరాబాద్, అక్టోబర్ 27: విద్యుత్ సర్వీస్ కనెక్షన్ల యాజమాన్య హక్కుల బదలాయింపు ( టైటిల్ ట్రాన్స్ఫర్ ) ప్రక్రియను టీఎస్పీడీసీఎల్ సులభతరం చేసింది. ఆఫీసుకు వెళ్లకుండా వారం రోజుల్లోనే ఆన్లైన్లో ప్రక్రియను పూర్తి చేసే వెసులుబాటు కల్పించింది. ఈ విషయాన్ని ఒక పత్రిక ప్రకటనలో టీఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి వెల్లడించారు.
గృహ ( కేటగిరీ -1 ) కనెక్షన్‌కు సంబంధించిన టైటిల్ ట్రాన్స్ఫర్ కోసం గుర్తింపు కార్డు, రూ.100 నాన్ జుడీషియల్ స్టాంప్ పేపర్‌పై ధ్రువీకరణ, ప్రస్తుత దరఖాస్తుదారుని పేరు మీద స్వీయ ధ్రువీకరణ లేదా రిజిస్టర్డ్ డీడ్, విల్ డీడ్ వంటి ఏదైనా యాజమాన్య హక్కు ధ్రువీకరణ పత్రం సమర్పించాలని సీఎండీ రఘుమారెడ్డి సూచించారు. గృహేతర ( కేటగిరీ-2) కనెక్షన్ కోసమైతే కంపెనీ అధికార పత్రం, ఉమ్మడి యాజమాన్యం ఉంటే రూ.10 నాన్ జుడీషియల్ స్టాంప్ పేపర్‌పై ఒప్పందం, పాత యజమాని చనిపోతే లీగల్ హెయిర్ సర్టిఫికేట్ పొందుపరచాలని పేర్కొన్నారు.
ఆన్లైన్లో దరఖాస్తు కోసం www.tssouthernpower.comలో లేదా ఇంటిగ్రేటెడ్ కస్టమర్ సర్వీస్ సెంటర్/ కస్టమర్ సర్వీస్ సెంటర్లో సంప్రదించాలని సూచించారు. నిబంధనల పేరుతో ఇబ్బందులకు గురిచేయొద్దని, దరఖాస్తు చేసిన వారం రోజుల్లో ప్రక్రియ పూర్తిచేయాలని అధికారులను రఘుమా రెడ్డి ఆదేశించారు.