వర్ధన్నపేట, నవంబర్ 13: ఓ వినియోగదారుడికి విద్యుత్తు శాఖ షాక్ ఇచ్చింది. ఏకంగా ఆ ఇంటికి రూ.1.34 లక్షల విద్యుత్తు బిల్లు (Electricity Bill) జారీ చేసింది. ఈ ఘటన వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ల్యాబర్తి గ్రామంలో చోటుచేసుకున్నది. బాధితుడి కథనం ప్రకారం.. ల్యాబర్తికి చెందిన అన్నమనేని దేవేందర్రావుకు మహాలక్ష్మి పథకంలో ప్రతినెలా జీరో బిల్లు వస్తున్నది. విద్యుత్తు సిబ్బంది నాలుగు నెలలుగా దేవేందర్రావు ఇంటి కరెంట్ మీటర్ రీడింగ్ తీయడం లేదు.
దేవేందర్రావు పలుమార్లు సిబ్బందిని అడిగినా బిల్లు ఇవ్వలేదు. గురువారం ఉదయం విద్యుత్తు సిబ్బంది మీటర్ రీడింగ్ తీసి బిల్లును కుటుంబ సభ్యులకు అందజేశారు. సాయంత్రం ఇంటికి వచ్చిన దేవేందర్రావు రూ.1,34,517 బిల్లు చూసి షాక్కు గురయ్యాడు. వెంటనే సిబ్బందిని నిలదీయగా పొంతనలేని సమాధానమిచ్చారు.ఉన్నతాధికారులు విచారణ జరిపి న్యాయం చేయాలని బాధితుడు కోరుతున్నాడు.