Telangana | హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, జనవరి 27 (నమస్తే తెలంగాణ): దాదాపు ప్రతిరైతు మూగజీవాలను పెంచుకుంటూ ఉంటాడు. జిల్లాల పరిధిలోని గ్రామాల్లో వాటికి మేత పుష్కలంగా దొరుకుతుంది కాబట్టి ఇబ్బందేమీ ఉండదు. మరి, హైదరాబాద్ చుట్టపక్కల ఉన్న రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల సంగతేమిటి? ఆయా జిల్లాల్లో ఉండే లక్షలాదిమంది సన్న, చిన్నకారు రైతులు కూరగాయలు పండిస్తూ ఆర్థిక చేదోడు కోసం బర్రెలను కూడా పెంచుకుంటూ ఉంటారు. వాటికి మేత దొరికే పరిస్థితి లేకపోవడంతో తమకున్న పొలంలోనే ఒకటిరెండు మడుల్లో పచ్చిగడ్డి కూడా పండిస్తారు. పశువులు ఆకులు తిని బలవర్ధకమైన కాండంలోని గుజ్జును వదిలేస్తున్నాయి. ఇలా అయితే గడ్డి వృథా కావడంతోపాటు పశువులకు సరైన మేత అందడం లేదని భావించిన రైతులు గడ్డిని కోసే చిన్న యంత్రాలు (కుట్టి మిషన్) తెచ్చుకుని గడ్డిని చిన్నచిన్న ముక్కలుగా చేసి పశువులకు పెడుతున్నారు.
గడ్డికోత యంత్రాలు ఉన్న రైతులపై విద్యుత్తు అధికారులు పగబట్టారు. ఈ యంత్రాలున్న ప్రతి రైతు కమర్షియల్ కరెంటు కనెక్షన్ తీసుకోవాల్సిందేనంటూ ఆదేశాలు జారీచేశారు. ఇందుకోసం వెంటనే డీడీలు తీయాలని, లేదంటే జరిమానా తప్పదని హెచ్చరిస్తున్నారు. శనివారం మహేశ్వరం మండల సర్వసభ్య సమావేశంలో పలువురు ప్రజాప్రతినిధులు ఇదే విషయాన్ని ప్రస్తావిస్తే తమకు పైనుంచి ఆదేశాలు ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు. యంత్రాలు ఉన్న రైతులు కమర్షియల్ కరెంటు కనెక్షన్ తీసుకోక తప్పదని తెగేసి చెప్పడంతో రైతులు లబోదిబోమంటున్నారు.