రెండు మహాసముద్రాల సంగమం. ప్రకృతి అందాలకు కొదువలేని ప్రాంతం. అన్నిటికీ మించి.. అంతులేని చారిత్రక విషాదాన్ని
గుండెల్లో దాచుకున్న గ్రామం. అదే.. తమిళనాడులోని ధనుష్కోటి. భారతదేశపు చిట్టచివరి ప్రాంతం. పంబన్ (రామేశ్వరం) ద్వీపానికి తూర్పు చివరన ఉన్న ఒక సన్నని భూభాగం ఇది. ఒకవైపు నిశ్శబ్దంగా ఉండే బంగాళాఖాతం, మరోవైపు అలల ఉధృతితో ఎగిసిపడే హిందూ మహాసముద్రం రెండూ ఇక్కడే కలుస్తాయి. ఈ సంగమ స్థలాన్ని ‘అరిచల్ మునై’ అంటే.. ల్యాండ్స్ ఎండ్‌గా పిలుస్తారు. పర్యాటకంగానే కాదు.. పురాణాలు, చారిత్రకంగానూ ఈ గ్రామానికి ఎంతో విశిష్ఠత ఉన్నది.
హిందూ పురాణాల ప్రకారం, లంకలో ఉన్న సీతాదేవిని రక్షించడానికి వానరసేనతో కలిసి శ్రీరాముడు ఇక్కడి నుంచే సముద్రంపై ‘రామసేతు’ నిర్మాణాన్ని ప్రారంభించారు. నాసా ఉపగ్రహ చిత్రాల్లోనూ ఇక్కడి నుంచి శ్రీలంక వరకు సముద్రం లోపల సున్నపురాయి తిన్నెల వరుస ఉన్నట్లు కనిపిస్తుంది.
పేరు వెనుక కథ..
ధనుష్ (విల్లు), కోడి (చివర).. అంటే ‘విల్లు చివర’ అని అర్థం. రావణ వధ తర్వాత విభీషణుణ్ని లంకకు రాజుగా పట్టాభిషిక్తుణ్ని చేస్తాడు శ్రీరాముడు. ఆ సమయంలో లంకకు రక్షణగా, శత్రువులు రాకుండా ఉండేందుకు రామసేతును ధ్వంసం చేయాలని రాముణ్ని ప్రార్థిస్తాడు విభీషణుడు. దాంతో శ్రీరాముడు తన ధనస్సు (విల్లు) ఒక చివరతో సేతువును ధ్వంసం చేస్తాడు. అందుకే, ఈ ప్రాంతానికి ‘ధనుష్కోడి’ అనే పేరు వచ్చిందని స్థల పురాణం. అదే కాలక్రమంలో ధనుష్కోటిగా మారింది. ఇక కాశీ యాత్ర చేసిన హిందువులు తమ యాత్ర పూర్తి కావాలంటే రామేశ్వరంలో జ్యోతిర్లింగ దర్శనం చేసుకోవడంతో పాటు, ధనుష్కోటిలోని పవిత్ర సముద్ర సంగమంలో ‘సేతు స్నానం’ ఆచరించడం సంప్రదాయంగా వస్తున్నది.
గతమెంతో ఘనం..
1964 డిసెంబర్ 23కు ముందు.. ధనుష్కోటి ఓ గొప్ప వాణిజ్య కేంద్రంగా, ‘మినీ సింగపూర్’గా విరాజిల్లింది. ఇక్కడ ఓడరేవుతోపాటు రైల్వే స్టేషన్, కస్టమ్స్ కార్యాలయాలు, పోస్టాఫీసు, పాఠశాలలు, ఆసుపత్రి, హోటళ్లు, ఎన్నెన్నో దుకాణాలు ఉండేవి. అప్పట్లో మద్రాస్ నుంచి ధనుష్కోటికి ‘బోట్ మెయిల్’ పేరుతో రైలు నడిచేది. అయితే, 1964 డిసెంబర్ 23 అర్ధరాత్రి.. ధనుష్కోటి చరిత్రకు కాళరాత్రిగా మారింది. 280 కి.మీ వేగంతో వీచిన భీకర తుఫాను, దాదాపు 20 అడుగుల ఎత్తున ఎగసిపడిన సముద్రపు అలలు.. ధనుష్కోటిని పూర్తిగా తుడిచిపెట్టేశాయి. అదే సమయంలో పంబన్ వంతెన దాటి ధనుష్కోటికి వస్తున్న ‘ప్యాసింజర్ రైలు’ కూడా ఆ అలల దాటికి సముద్రంలో పడిపోయి, మునిగిపోయింది. మరుసటి రోజు భారత ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని ‘ఘోస్ట్ టౌన్’గా ప్రకటించింది.
చిగురిస్తున్న ఆశలు..
కొన్నేళ్లుగా బయటి వ్యక్తులు అడుగుపెట్టని ఈ ప్రాంతం.. ఇప్పుడిప్పుడే పర్యాటకులతో కళకళలాడుతున్నది. ప్రస్తుతం కొద్దిమంది మత్స్యకారులు తాత్కాలిక గుడిసెల్లో నివసిస్తూ.. పర్యాటకులకు చిన్నచిన్న వస్తువులు అమ్ముకుంటూ జీవిస్తున్నారు. ఘోస్ట్ టౌన్‌గా మారిన ధనుష్కోటిలో చూడాల్సిన ప్రాంతాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా, ఆనాటి తుఫాను ధాటికి తట్టుకుని ఇప్పటికీ నిలిచి ఉన్న పాత చర్చి, రైల్వే స్టేషన్ గోడలు, కస్టమ్స్ ఆఫీస్ శిథిలాలు చూస్తే.. నాటి బీభత్సం కళ్లముందు కదలాడుతుంది. ఇక రామేశ్వరం నుంచి ధనుష్కోటి వరకూ సముద్రం మధ్యలోంచి సాగే రహదారి మరో అద్భుతం. ఒకవైపు బంగాళాఖాతం, మరోవైపు హిందూ మహాసముద్రం మధ్య ఉన్న ధనుష్కోటి బీచ్ అందాలు మాటల్లో వర్ణించలేనివి. సముద్రం మధ్యలోంచి సాగే రోడ్డు ప్రయాణం.. జీవితంలో మరిచిపోలేని మధురానుభూతిని అందిస్తుంది.
ఇలా చేరుకోవాలి..
దేశంలోని అన్ని ప్రముఖ నగరాల నుంచి రామేశ్వరం వరకూ రైలు సదుపాయం ఉంది. అక్కడి నుంచి ధనుష్కోటి కేవలం 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. రామేశ్వరం నుంచి బస్సులు, ఆటోలు, టాక్సీల ద్వారా ఇక్కడికి సులభంగా చేరుకోవచ్చు. భద్రతా కారణాల దృష్ట్యా ధనుష్కోటిని సందర్శించడానికి ఉదయం 6:00 నుంచి సాయంత్రం 6:00 గంటల వరకు మాత్రమే అనుమతిస్తారు. రాత్రి వేళల్లో ఇక్కడ ఉండటానికి అనుమతి ఉండదు. ఎందుకంటే.. ధనుష్కోటిలో హోటళ్లు, లాడ్జీలు ఏవీ ఉండవు. పర్యాటకులు రామేశ్వరంలోనే బస చేయాల్సి ఉంటుంది. ఇక అక్టోబర్ నుంచి మార్చి నెలల మధ్య ఇక్కడి వాతావరణం చాలా ఆహ్లాదకరంగా, పర్యటనకు అనుకూలంగా ఉంటుంది.