‘ఒక్క రోజు చెట్టు ఎక్కకపోయినా..కాళ్లు గుంజినట్టు అయితది.అస్సలు సుదరాయించదు’ అంటాడు 70 ఏండ్ల కల్లుగీత కార్మికుడు సత్యనారాయణ గౌడ్. ఉదయ భానుడు ఉల్లిపొర ఛాయను వీడకముందే.. సత్యనారాయణ ఈత వనాల్లోకి ప్రవేశిస్తాడు. ఈతాకులపై ఈదులాడుతూ రవి కిరణాలు ఏదో ఉత్సాహాన్నిస్తాయి. అప్పటికే ఆ చెట్ల కిందికి కొందరు చేరి, మోదుగ ఆకులు మడిచి చేతబూని ఎదురుచూస్తూ ఉంటారు. సత్యనారాయణ రంగప్రవేశం చేయగానే వారిలో ఏదో ఉత్సాహం. 70 ఏండ్ల మనిషి 60 అడుగుల చెట్టుకూడా చకచకా ఎక్కేస్తాడు. తొలిపొద్దు వేళకు తాజాగా నిండిన నీరా కుండను పొందికగా కిందికి దించి.. అక్కడున్నవారికి ఆప్యాయంగా పంచుతాడు. రోజూ ఇదే సీను కనిపిస్తుంటుంది!
ఆ ఒక్క చెట్టే కాదు.. రోజుకు 30 చెట్లు అవలీలగా ఎక్కేస్తాడు. కల్లు కుండలు కిందికి దించుతాడు. ఈ వయసులో ఇంత కష్టం ఎందుకు పెద్దాయన అని అడిగితే.. ‘నాకు పూట గడవక ఈ పని చేయడం లేదు సారూ! ఈ పనిలో నాకు తృప్తి ఉన్నది. ఏ రోజైనా చెట్టు ఎక్కకపోతే కాళ్లు గుంజినట్టు అయితయి’ అని చిరునవ్వుతో బదులిస్తాడు మెదక్ జిల్లా తూప్రాన్‌కు చెందిన సత్యనారాయణ. ఉదయం పూట తాజా నీరా కుండ దించుతాడు. ‘నీరా కుండను రూ.200కు అమ్ముతా! 15-20 దాకా కల్లు కుండలు దించుతా! రోజుకు రెండు వేల నుంచి మూడు వేల వరకు ఆదాయం వస్తది. కొందరు సీసాల్లో కొంటవోతరు’ అని చెప్పుకొచ్చాడు సత్యనారాయణ.
వృత్తే జీవనంగా..
సత్యనారాయణ పెద్దగా చదువుకుంది లేదు. పన్నెండేండ్లు ఉన్నప్పటి నుంచి తన తండ్రి వెంట తిరుగుతూ కల్లు గీయడం నేర్చుకున్నాడు. ఆనాటి నుంచి అదే పనిలో కొనసాగుతున్నాడు. వృత్తిగా మొదలైన కల్లుగీత తర్వాతి కాలంలో జీవనంగా మారిపోయింది. సత్యనారాయణకు ఇద్దరు కూతుళ్లు, ఇద్దరు కొడుకులు. అందరూ తమ తమ జీవితాల్లో స్థిరపడ్డారు. ఒక కొడుకు సింగపూర్‌లో నిర్మాణ రంగంలో పనిచేస్తున్నాడు. కొడుకులు ఎంత చెప్పినా.. సత్యనారాయణ మాత్రం తన పని మానడు. ‘కాళ్లూ చేతులూ ఆడినంత కాలం పనిచేయాలి కదా! పనిచేయకపోతే ఏదో రందిగా ఉంటది’ అంటాడాయన. దశాబ్దాలుగా ఈత చెట్టు నీడలో ఎదిగిన ఈ మనిషి చెప్పే విషయాలు ఆసక్తికరంగా ఉంటాయి. ‘ఉదయం పూట వచ్చే నీరాలో ఆల్కహాల్ ఉండదు సార్! అది పెయ్యికి మంచిది. అందుకే నీరా కోసం చాలామంది పొద్దుగాళ్లనే ఈత తోపుల దగ్గరికి వస్తరు. అదే పానీయం కొన్ని గంటలు నిల్వ ఉంటే సహజసిద్ధంగా పులిసి కల్లుగా మారుతుంది. అందులో ఆల్కహాల్ ఉంటది’ అని చెబుతాడు సత్యనారాయణ.
చెట్లపై పాములు… నడుముకు గజ్జెలు
కల్లుతీత అనేది కళాత్మకంగా కనిపించినా నిత్యం ప్రాణాలతో చెలగాటమే అంటాడు సత్యనారాయణ. రోజూ చెట్లు ఎక్కేటప్పుడు ముండ్లు గుచ్చుకోవడం సాధారణమే! కానీ, చెట్లు ఎక్కేటప్పుడు ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా.. అంతెత్తు మీది నుంచి కిందపడితే కష్టమే! ఇంకా అసలు ప్రమాదం పాముల రూపంలో పొంచి ఉంటుంది. ‘పాములు కూడా చెట్లపైకి వెళ్లి కల్లు తాగుతుంటాయి. అందుకే మేము నడుముకు గజ్జెలు కట్టుకుంటాం. ఆ శబ్ద తరంగాలకు పాములు దూరంగా వెళ్లిపోతాయి’ అని చెబుతాడు. ‘పాములు తాకిన కల్లు తాగితే ప్రమాదం కదా!’ అని ఆశ్చర్యంగా అడిగితే సత్యనారాయణ నవ్వుతూ ‘సారూ! దానిలో విషం ఏం ఉండదు. అసలు పుట్ట ఉన్న ఈత చెట్టుకు తీసిన కల్లుకే డిమాండ్ ఎక్కువ’ అంటాడు. గ్రామీణ విశ్వాసాలు, అనుభవాలు, ప్రకృతితో మమేకమైన జీవితం ఇవన్నీ ఆయన మాటల్లో వినిపిస్తాయి.
ఈ తరమే ఆఖరేమో!
ఒకప్పుడు గౌడ కుటుంబాల జీవనాధారంగా ఉన్న కల్లుగీత వృత్తి ఇప్పుడు క్రమంగా తగ్గిపోతున్నది. చెట్లు ఎక్కే శ్రమ, ప్రమాదాలు, ఆత్మగౌరవం సమస్య తదితర కారణాల వల్ల యువత ఈ వృత్తిలోకి రావడానికి అంతగా ఆసక్తి చూపడం లేదు. ‘చెట్లు ఎక్కి కల్లు తీసేతరం మాతోనే ముగిసిపోవచ్చు. అందుకే ఇప్పటి యువతకు ఈ పని నేర్పించాలని ఒక శిక్షణా కేంద్రం ఏర్పాటు చేయాలనుకుంటున్నాను’ అంటాడు. ఆయన మాటల్లో ఒక సంప్రదాయం ప్రమాదంలో ఉందన్న ఆవేదన వినిపిస్తుంది. పగలంతా కష్టపడినా సత్యనారాయణ పెద్దగా సంపాదించింది లేదు. పాత తరం నాటి మట్టి గోడల ఇంట్లోనే ఉంటున్నాడు. పెద్ద వయసులో శ్రమిస్తున్న తండ్రిని గమనిస్తున్న ఆయన కూతురు ‘మా బాపే మా హీరో’ అని గర్వంగా చెబుతుంది. పొద్దంతా కష్టపడే సత్యనారాయణ పొద్దుగూకిన తర్వాత ఇంట్లో కులాసాగా గడుపుతాడు.
కుటుంబసభ్యులతో ఇచ్చికాలాడుతూ ఉల్లాసంగా ఉంటాడు. ఇంట్లో కల్లు కుండలు నిండుగా ఉన్నా.. బొట్టు తాకడు, చుక్క తాగడు. అదేంటని అడిగితే.. ‘నాకు అలవాటు లేదు సార్! నేను తీసిన కల్లు నేనే తాగితే… నా కల్లు మీద నమ్మకం పోతది. స్వచ్ఛమైన కల్లు అంతా ఈడే తాగేసి.. నాసిరకం మాకు పోస్తున్నడు అనుకునే ప్రమాదం ఉంది. గందుకే, ఇప్పటి వరకు నేను కల్లు తాగలేదు. స్వచ్ఛమైన నీరాను ప్రజలకు ఇవ్వడమే నా వృత్తి ధర్మం’ అని వినయంగా చెబుతాడు సత్యనారాయణ. ఈ కథ ఓ వృద్ధ కార్మికుడి జీవితం మాత్రమే కాదు, శ్రమ మీద విశ్వాసం, స్వాభిమానం మీద నిలిచిన బతుకు. ప్రకృతితో మమేకమై నడుస్తున్న కథ. నేటి ప్రపంచం యంత్రాల వైపు పరుగులు తీస్తుంటే, తూప్రాన్ ఈత తోటల్లో మాత్రం ఇంకా ఒక మనిషి గజ్జెల శబ్దంతో చెట్టు ఎక్కుతున్నాడు. అది కేవలం కల్లు కోసం కాదు… తన జీవితం ఇంకా నిలిచే ఉందని ప్రపంచానికి చెప్పడానికి.
ఎన్టీయార్ ఇలాఖాలో..
కల్లుతీతలో నేర్పరి అనిపించుకున్న సత్యనారాయణ ప్రయాణం ఒక ఊరికి పరిమితం కాలేదు. ప్రముఖ సినీనటుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు స్వగ్రామం నిమ్మకూరులో కొన్నాళ్లు ఉన్నాడు సత్యనారాయణ. అక్కడ నెల జీతానికి కల్లు తీసే కార్మికుడిగా పనిచేశాడు కూడా. ఎన్టీయార్ స్వగ్రామంలో పనిచేసిన ఆ రోజులు ఎప్పటికీ మర్చిపోలేనని గుర్తు చేసుకుంటూ ఉంటాడు.
-శ్యాంమోహన్ 9440595858