హైదరాబాద్, జూలై 12 (నమస్తే తెలంగాణ) : విద్యుత్తు ఆర్టిజన్స్ కన్వర్షన్ కోసం ఈ నెల 14 నుంచి నిర్వహించతలపెట్టిన నిరవధిక సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేసినట్టు తెలంగాణ విద్యుత్తు ఆర్టిజన్స్ కన్వర్షన్ జేఏసీ ప్రకటించింది. ఈ మేరకు ఆదివారం హైదరాబాద్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సమ్మెను వాయిదా వేస్తున్నట్టు జేఏసీ నేతలు ప్రకటించారు.
ఆర్టిజన్ల సమ్మెపై కార్మికశాఖ జోక్యం చేసుకుని ఈ నెల 10న చర్చలు జరిపింది. రెండు వారాల సమయం కావాలని కోరింది. ఎమర్జెన్సీ సర్వీస్ కావడం, చర్చలు జరుపుతున్నప్పుడు సమ్మెకు దిగడం సబబుకాదని కార్మికశాఖ అధికారులు సూచించారు. ఈ నెల 23న మరోసారి సమావేశాన్ని నిర్వహించనున్నట్టు తెలిపారు. దీంతో సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్టు జేఏసీ చైర్మన్ కే ఈశ్వర్రావు, స్టేట్ కన్వీనర్ ఎంఏ వజీర్, కో చైర్మన్లు నాగరాజు, నరేందర్ ప్రకటించారు.