హైదరాబాద్, మార్చి 21 ( నమస్తే తెలంగాణ ) : వేలాడే తీగలు.. తెగిపడ్డ కేబుళ్లు.. స్తంబాలకు విద్యుత్తు సరఫరా.. వర్షాలు, గాలులు.. పంట రక్షణ కంచెలు.. ఇలా పలురకాలుగా కరెంటు మనుషులు, పశువుల ప్రాణాలను కబళిస్తున్నది. దక్షిణ తెలంగాణ డిస్కమ్ పరిధిలోనే 2019 నుంచి 2025 వరకు 1,531 మందిని కరెంట్ బలిగొన్నది. మరో 296 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. రోజుకు రెండు చొప్పున పశువులు మృత్యువాతపడుతున్నాయి. ఈ మేరకు తెలంగాణ విద్యుత్తు నియంత్రణ మండలి నిర్వహించిన బహిరంగ విచారణలో టీజీఎస్పీడీఎల్ అధికారులు వెల్లడించారు. కరెంటు షాక్‌లతో మరణించే వారిలో రైతులే ఎక్కువగా ఉంటున్నారు. చాలామంది విద్యుత్తుశాఖ సిబ్బంది ప్రాణాలు కోల్పోవడంతో పాటు మరికొందరు వైకల్యం బారినపడుతున్నారు.
దక్షిణ డిస్కమ్ పరిధిలోని ఆపరేషన్ ఏఈ పోస్టులు 60 వరకు ఖాళీగా ఉన్నాయి. వీటిలో గ్రామీణ ప్రాంతాల్లోని పోస్టులే ఎక్కువ. దీంతో అధికారులు కార్యకలాపాలను ఇన్‌చార్జీలతో నెట్టుకొస్తున్నారు. ఎండలు తీవ్రమవడం, విద్యుత్తుకు డిమాండ్ పెరగడంతో చాలాచోట్ల విద్యుత్తు అంతరాయం ఏర్పడటం, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోవడం వంటి ఘటనలు జరుగుతున్నాయి. ఎండుతున్న పంటలను కాపాడుకోవాలని, పంటలకు నీరందించాలన్న ఆశ రైతులన్నలను బలితీసుకుంటున్నది. వ్యవసాయ ట్రాన్స్ఫార్మర్లకు రక్షణ లేకపోవడం, వేలాడే వైర్లను విద్యుత్తు సిబ్బంంది ఎప్పటికిప్పుడు సరిచేయకపోవడం, ఫిర్యాదులపై సమయానికి స్పందించకపోవడంతో రైతులే మరమ్మతులు చేసుకోవాల్సి వస్తున్నది. ట్రాన్స్ఫార్మర్ల ఫ్యూజులు సరిచేయడం వంటి ఘటనల్లోనే చాలామంది రైతులు ప్రాణాలు కోల్పోతున్నారు. కరెంట్ షాక్‌తో మరణించిన వారందరి కుటుంబాలకు విద్యుత్తు సంస్థలు సక్రమంగా పరిహారం చెల్లించడంలేదు. శాఖాపరమైన తప్పిదం కాదంటూ అధికారులు సాకులు చెబుతున్నట్టు పరిహారం అందని బాధిత కుటుంబాల సభ్యులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.