హైదరాబాద్, ఫిబ్రవరి 12 (నమస్తే తెలంగాణ): విద్యుత్తు బస్సులను ఆర్టీసీకే అప్పగించాలని ఐఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వై నాగన్నగౌడ్ డిమాండ్ చేశారు. విద్యుత్తు బస్సులతో టీజీఎస్ ఆర్టీసీ ఉద్యోగుల భద్రతకు ఎలాంటి ముప్పుండదని స్పష్టం చేశారు. హైదరాబాద్ నారాయణగూడలోని ఆ సంఘం రాష్ట్ర కార్యాలయంలో బుధవారం నిర్వహించిన టీజీఎస్ ఆర్టీసీ స్టాఫ్ అండ్ వరర్స్ యూనియన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకం ఫేమ్-2 ద్వారా సమకూర్చుకొనే విద్యుత్తు బస్సుల నిర్వహణ ప్రైవేటు సంస్థలకు అప్పగించకుండా ఆర్టీసీ స్వయంగా చేపట్టాలని కోరారు. విద్యుత్తు బస్సులను ఆర్టీసీకి కాకుండా ప్రైవేటు సంస్థలు నిర్వహించేలా కేంద్ర ప్రభుత్వ విధానాలు ఉండటం దుర్మార్గమని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వంపై తమ సంఘం జాతీయ అధ్యక్షుడు సంజీవరెడ్డి ఒత్తిడి తెస్తున్నారని, ప్రభుత్వం కూడా సానుకూలంగా ఉన్నదని అన్నారు. ఈ సమావేశంలో యూనియన్ వరింగ్ ప్రెసిడెంట్ ఎస్ మహమూద్, ప్రధాన కార్యదర్శి కే రాజిరెడ్డి, ఉపాధ్యక్షుడు జీ అబ్రహం, డీ గోపాల్, ఉప ప్రధాన కార్యదర్శి జే మల్లేశ్, కార్యదర్శి ఎస్ సాయిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.