హైదరాబాద్, అక్టోబర్ 10 (నమస్తే తెలంగాణ): ఇటీవలి కాలంలో అవకాశం వచ్చిన ప్రతిసారీ హైదరాబాద్ కాలుష్యాన్ని ఢిల్లీతో పోలుస్తూ మాట్లాడుతున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Revanth Reddy) నగరాన్ని కాలుష్య రహితంగా మార్చాలని పంతంపట్టినట్టు పదేపదే చెప్పుకొచ్చారు. అందులో భాగంగానే పర్యావరణానికి ఎలాంటి హానీ చేయని ఎలక్ట్రిక్ బస్సులను (Electric Bus) ప్రవేశపెడుతున్నట్టు పేర్కొన్నారు. ఇప్పటికే విడతల వారీగా 270 వరకు బస్సులను ప్రవేశపెట్టారు. త్వరలోనే మరో 250 వరకు కొత్త బస్సులు వచ్చే అవకాశం ఉన్నది. రానున్న రెండేళ్లలో 2,800 ఎలక్ట్రిక్ బస్సులు రాబోతున్నాయని సమాచారం. అయితే, ఈ మొత్తం ప్రణాళిక వెనుక భయంకరమైన ప్లాన్ ఉన్నట్టు తెలిసింది.
నగరంలో ప్రస్తుతం నడుస్తున్న బస్సుల స్థానంలో మొత్తం ఎలక్ట్రిక్ బస్సులు తీసుకొచ్చి ప్రైవేటు పరం చేసే యోచన ఉన్నట్టు సమాచా రం. అదే జరిగితే డ్రైవర్లు, కండక్టర్లు, ఇత ర సిబ్బంది కలిపి దాదాపు 20 వేలమ ం ది వరకు ఉద్యోగాలు కోల్పోవడం ఖా యంగా కనిపిస్తున్నది. డిపోలను ఎలక్ట్రిక్ బస్‌లకు ఇవ్వడం, వాటిలో చార్జింగ్ స్టేషన్లు నిర్మిస్తుండటం, ఆర్టీసీ ఆస్తులు లీ జుకు ఇస్తుండటంతోపాటు ఉప్పల్, మియాపూర్ వర్క్‌షాపులను తరలించడం, కార్గోను ఇప్పటికే ప్రైవేటు పరం చేయడం వంటివి ఈ వార్తలకు మరింత బలం చేకూరుస్తున్నాయి. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం వల్ల జీహెచ్ఎంసీ పరిధిలో ఆర్టీసీ మాయం కావడం ఖాయమని కార్మికులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
అమ్మలాంటి ఆర్టీసీ కోసం
నిజానికి ఆర్టీసీలో సిబ్బంది కొరత తీవ్రంగా వేధిస్తున్నది. డ్రైవర్లు, కండక్టర్లు సరిపడా లేకపోవడంతో ఉన్న వారిపై భా రం పడుతున్నది. అయినప్పటికీ అమ్మలాంటి ఆర్టీసీ కోసం రేయింబవళ్లు కష్టపడుతున్నారు. అలాంటిది ఇప్పుడు ఒక్కసారిగా వేలమందిపై కత్తి వేలాడుతుండటంతో కార్మికుల్లో ఆందోళన మొదలైంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రవేశపెట్టే ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణను కూడా ఆర్టీసీకే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించాలని, తాము ప్రభుత్వానికి మద్దతుగా ఉంటామని కార్మికులు చెప్తున్నారు.
బలవంతపు వీఆర్ఎస్లు
ఎలక్ట్రిక్ బస్సులు ఇబ్బడిముబ్బడిగా రోడ్డుపైకి వస్తే అంతే సంఖ్యలో డ్రైవర్, కండక్టర్ల ఉద్యోగాలు పోవడం కూడా ఖాయమన్న వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, కార్మికులను ఒక్కసారిగా తొలగించకుండా వీఆర్ఎస్ కోసం అధికారులు వారిని మానసికంగా సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. ఎలక్ట్రిక్ బస్సుల కారణంగా ఉద్యోగాలు పోతాయని, కాబట్టి వీఆర్ఎస్ మేలంటూ కార్మికులను ఒప్పిస్తున్నట్టు తెలిసింది. అంతేకాదు, జీహెచ్ఎంసీ పరిధిలోని కొందరు కార్మికులతో ఈ ప్రతిపాదనలపై మౌఖికంగా చర్చించినట్టు కూడా సమాచారం. వీఆర్ఎస్కు అంగీకరించని వారిని జిల్లాలకు పంపించబోతున్నట్టు లీకులు ఇస్తున్నారు. అంతేకాదు, మాట వినని వారిపై వేటు తప్పదన్న సంకేతాలు కూడా ఇస్తున్నారని డిపో సిబ్బంది, కార్మికులు చెప్తున్నారు.