కరీంనగర్ తెలంగాణచౌక్, డిసెంబర్ 1 : తమకు జీతాలు చెల్లించాలని కోరుతూ ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు డైవర్లు అదివారం కరీంనగర్ డిపో-2 ఎదుట ధర్నాకు దిగారు. కరీంనగర్ నుంచి జేబీఎస్‌కు వెళ్లాల్సిన 33, రాజన్న సిరిసిల్లకు వెళ్లాల్సిన 6 బస్సులు నిలిచిపోయాయి. ఆయా ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు బస్సుల్లేక ఇబ్బందులు పడ్డారు. అధికారులు ఇతర ప్రాంతాలకు నడవాల్సిన బస్సులను హైదరాబాద్ రూట్లో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కరీంనగర్ డిపో-2 ఎలక్ట్రిక్ బస్సు డైవర్స్ యూనియన్ అధ్యక్షుడు సత్యపాల్‌రెడ్డి మాట్లాడుతూ జైభారత్ మారుతీ సంస్థకు చెందిన ఎలక్ట్రిక్ బస్సు డ్రైవర్ల సర్వీసులను అందించే శ్రీచక్ర సర్వీసు యాజమాన్యం మూడు నెలలుగా జీతాలను చెల్లించడంలేదని ఆరోపించారు.
లేబర్ యాక్ట్ ప్రకారం కనీస వేతనం రూ.26 వేలు చెల్లించకుండా రూ.15 వేలే అందిస్తున్నారని తెలిపారు. నెలలో 30 రోజుల డ్యూటీ చేయాలని ఒత్తిడి చేస్తున్నారని వాపోయారు. నెలకు 4 వీక్లీ ఆఫ్‌లు, 2 సీఎల్‌లు, ఈఎస్ఐ, పీఎఫ్ చెల్లించాలని డిమాండ్ చేశారు. మధ్నాహ్నం వరకు బస్సులను తీయకపోవడంతో యాజమాన్యం చర్చించి నెల జీతాన్ని వారి ఖాతాలో వేశారు. మిగతా డిమాండ్లను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ధర్నాను విరమించారు.