కవాడిగూడ (హైదరాబాద్), నవంబర్ 16: ‘రాజ్యాంగ సవరణతోనే 42% బీసీ రిజర్వేషన్ల (BC Reservations) అమలుకు శాశ్వత పరిష్కారం చేకూరుతుంది. పార్టీపరంగా బీసీ కోటా (BC Quota)అమలు చేస్తామంటే సర్కారుపై యుద్ధం తప్పదు’ అని రాష్ట్ర ప్రభుత్వాన్ని రాజ్యసభ సభ్యుడు, బీసీ జేఏసీ చైర్మన్ ఆర్ కృష్ణయ్య హెచ్చరించారు. 42 శాతం బీసీ రిజర్వేషన్లకు చటబద్ధత క్పలించిన తర్వాతే చట్టపరంగా ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. అఖిలపక్ష నేతలను ఢిల్లీకి తీసుకెళ్లి ప్రధాని మోదీతో చర్చించాలని కాంగ్రెస్ సర్కార్‌ను డిమాండ్ చేశారు. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను పార్టీల పరంగా కాకుండా చట్టబద్ధంగా కల్పించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ బీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్ ఇందిరాపార్కు వద్ద బీసీల న్యాయసాధన దీక్ష చేపట్టారు.
బీసీ కమిషన్ మాజీ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు, బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ నీల వెంకటేశ్ ఆధ్వర్యంలో జరిగిన దీక్షలో ఆర్ కృష్ణయ్యతోపాటు హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, ఎమ్మెల్సీ ఎల్ రమణ, బీసీ సంక్షేమ సంఘం జాతీయ కోఆర్డినేటర్ ర్యాగ అరుణ్‌కుమార్ తదితర బీసీ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ రిజర్వేషన్లపై బీసీల్లో చైతన్యం వచ్చిందని, ఇప్పుడు సాధించకపోతే ఇక ముందు సాధించలేమని చెప్పారు. రిజర్వేషన్లను సాధించుకునేంత వరకూ బీసీలంతా ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. రాజకీయాలకు అతీతంగా పార్టీలన్నీ ఏకాభిప్రాయంతో ముందుకు రావాలని కోరారు.
రాజ్యాంగ సవరణకు అందరూ మద్దతు పలకాలని కోరారు. పార్టీపరంగా రిజర్వేషన్లు కల్పించి ఎన్నికలను నిర్వహించేందుకు క్యాబినెట్ భేటీలో నిర్ణయం తీసుకోవాలని భావించడం బీసీలకు ద్రోహం చేయడమేనని ధ్వజమెత్తారు. తొందరపడి ఎన్నికలకు వెళ్లడం ఎందుకని ప్రభుత్వాన్ని నిలదీశారు. అన్ని జిల్లాల్లో బీసీ, కుల, ఇతర ప్రజాసంఘాలతో సమావేశాలు నిర్వహించి కార్యాచరణ సిద్ధం చేయాలని సూచించారు. నిరాహార దీక్షలు, ధర్నాలు పెద్ద ఎత్తున చేపట్టాలని పిలుపునిచ్చారు.
రాజ్యాంగం ప్రకారం సమాజంలోని అన్నివర్గాలకు సమానమైన హక్కులు దక్కాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎల్ రమణ కోరారు. జనాభా దామాషా ప్రకారం బీసీలకు రిజర్వేషన్లు కల్పించాల్సిన అవసరం ఉన్నదని నొక్కిచెప్పారు. రిజర్వేషన్ల సాధన కోసం రాజకీయాలు పక్కనబెట్టి బీసీలంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు 42 శాతం రిజర్వేషన్లను చట్టపరంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. దీనికోసం కాంగ్రెస్ ప్రభుత్వం చొరవ తీసుకోవాలని సూచించారు. అలా కాకుండా పాత పద్ధతి ప్రకారమే ఎన్నికలకు వెళ్తే బీసీలను దగా చేసినట్టేనని మండిపడ్డారు. బీసీల పోరాటానికి బీసీ జేఏసీ నిర్మాణాత్మకమైన కార్యక్రమాలను నిర్మించాలని కోరారు.
రాష్ట్రంలో 42% బీసీ రిజర్వేషన్ల అమలు విషయమై తాను ప్రధాని మోదీతో చర్చిస్తానని హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ తెలిపారు. 42% రిజర్వేషన్లను కల్పించడం న్యాయసమ్మతమైన డిమాండ్ అని పే ర్కొన్నారు. కేంద్రంలోని అన్ని పార్టీలను ఏకాభిప్రాయానికి తేవాలని, అప్పుడే పార్లమెంట్లో రిజర్వేషన్ల బిల్లు పాస్ అవుతుందని చెప్పారు. రిజర్వేషన్లు అమలయ్యేంత వరకూ బీసీలు పోరాడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీసీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జిల్లపల్లి అంజి, బీసీ నాయకులు గొరిగె మల్లేశ్, శివకుమార్, అనంతయ్య, రాజేందర్, సతీశ్, మోదీరాందేవ్ పాల్గొన్నారు.