జడ్చర్లటౌన్, నవంబర్ 16 : చట్టపరంగా బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించాకే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి డిమాండ్ చేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధన పోరాటంలో భాగంగా బీసీ జాగృతిసేన, బీసీ జేఏసీ, బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఆదివారం మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో ధర్మదీక్ష, సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు.
బీసీల ధర్మ దీక్షకు స్థానిక ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్, మాజీ మంత్రి హాజరై మద్దతు తెలిపారు. అనంతరం లక్ష్మారెడ్డి మాట్లాడుతూ పార్టీల పరంగా రిజర్వేషన్లు సరైంది కాదని, ఎన్నికల ప్రక్రియ మొదలైతే బీసీ రిజర్వేషన్ల అంశం పెండింగ్‌లో పడుతుందని చెప్పారు. బీసీ రిజర్వేషన్ల సాధన కోసం పార్టీలకు అతీతంగా పోరాడాల్సిన అవసరం ఉందని తెలిపారు. చట్టపరంగా 42 శాతం బీసీ రిజర్వేషన్ల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తేవాలని పిలుపునిచ్చారు.