హైదరాబాద్, డిసెంబర్ 1 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఎన్నికల బదిలీలను వెంటనే చేపట్టాలని తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వంగ రవీందర్‌రెడ్డి డిమాండ్ చేశారు. మూసారంబాగ్‌లోని రెవెన్యూ భవన్లో ఆదివారం టెస్రా రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. సమావేశంలో రెవెన్యూ ఉద్యోగుల సమస్యలు, డిమాండ్లపై పలు తీర్మానాలు చేశారు. పదోన్నతి పొందిన నాయబ్ తహసీల్దార్లకు సొంత జిల్లాల్లోనే పోస్టింగ్ ఇవ్వాలని కోరారు.
మీసేవ, ధరణి రిజిస్ట్రేషన్ల యూజర్ చార్జీలు నేరుగా తహసీల్దారుకు మంజూరు చేయాలని విన్నవించారు. మెడికల్, పెండింగ్ వెహికిల్ బిల్లులతోపాటు ఉద్యోగుల అన్ని బిల్లులను వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో టెస్రా రాష్ట్ర కార్యదర్శి గౌతమ్‌కుమార్, అసోసియేట్ అధ్యక్షులు రాజ్‌కుమార్, రియాజుద్దీన్, ఉపాధ్యక్షులు, ఆర్గనైజింగ్ సెక్రటరీలు పాల్గొన్నారు.