Telangana | జనగామ చౌరస్తా, మే 13: ఎన్నికల విధుల్లో పాల్గొన్న ప్రిసైడింగ్ అధికారులు(పీవో), అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు (ఏపీవో), అదర్ ప్రిసైడింగ్ అధికారులు (ఓపీవో)తో పాటు రిజర్వ్‌లో ఉన్న ఎన్నికల సిబ్బంది జనగామ నియోజకవర్గం పరిధిలో అసౌకర్యాల నడుమ తీవ్ర ఇబ్బందులు పడ్డారు. జిల్లా కేంద్రంలోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో ఏర్పాటు చేసిన ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రంలో రిజర్వ్‌లో ఉన్న 80మంది సిబ్బందికి మధ్యాహ్నం 2 గంటలలోపు లంచ్ పెట్టాల్సి ఉండగా, 3.30గంటల వరకు కూడా భోజనం పెట్టకపోవడంతో ఆకలితో అలమటించారు.
చివరికి భోజనం ఏర్పాటు చేశారని, సరిగా ఉడికి ఉడకని అన్నం, కూరలను అందించారని ఆవేదన వ్యక్తం చేశా రు. మెనూ ప్రకారం ప్రతి గంటకు ఒకసారి మజ్జిగ, స్నాక్స్ అందించాల్సిన ఉన్నా కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వలేదని, ఈఆర్వోగా ఉన్న ఆర్డీవో కొముర య్య దృష్టికి తీసుకెళ్లిన స్పందించలేదని ఆవేదన వెలిబుచ్చారు. మహిళా ఉద్యోగులకు టాయిలెట్స్ సౌకర్యం కల్పించడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని పేర్కొన్నారు. ఆదివారం రాత్రి ఈదురు గాలులతో భారీ వర్షం కురవడంతో ఉండడానికి సరైన వసతులు, కరెంట్ లేకపోవడంతో లాడ్జీలు అద్దెకు తీసుకొని ఉన్నట్టు ఉద్యోగులు పేర్కొన్నారు.