రాజన్న సిరిసిల్ల, ఏప్రిల్ 13(నమస్తే తెలంగాణ) : సిరిసిల్ల మున్సిపల్ కో ఆప్షన్ సభ్యుల ఎన్నిక సోమవారం జరిగింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నీ తానై అభ్యర్థులను గెలిపించుకున్నారు. బీఆర్ఎస్ రికార్డు స్థాయిలో 27 స్థానాల్లో విజయం సాధించి, మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. మున్సిపల్ కో ఆప్షన్ ఎన్నిక సైతం సజావుగా పూర్తి చేయగా, విధేయతకే పట్టంగట్టారు. కేటీఆర్ సూచనతో మాజీ కౌన్సిలర్లు నంది శంకర్, కొండా అనూష, సయ్యద్ తస్లీమా, బీఆర్ఎస్ యూత్ నాయకుడు సయ్యద్సోహైల్ను పాలకవర్గం ఏకగ్రీవంగా ఎన్నుకున్నది. కోఆప్షన్ సభ్యుల ఎన్నిక పూర్తి కావడంతో పాలకవర్గం సంపూర్ణంగా కొలువుదీరింది. తమకు అవకాశం కల్పించిన కేటీఆర్‌కు నూతన కోఆప్షన్ సభ్యులు నంది శంకర్, కొండా అనూష, సయ్యద్తస్లీమా, సయ్యద్సోహైల్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సహకరించిన నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, టెక్స్టైల్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గూడూరి ప్రవీణ్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ, వైస్ చైర్మన్ దార్ల సందీప్, కౌన్సిలర్లకు కృతజ్ఞతలు తెలిపారు. మున్సిపల్ కోఆప్షన్ సభ్యుల ఎన్నికలోనూ బీఆర్ఎస్ అభ్యర్థులే ఎన్నికకావడంతో సిరిసిల్ల గులాబీ శ్రేణుల్లో నయాజోష్ వచ్చింది.
రేవంత్ ఫొటో ఎందుకు పెట్టాలి?
సిరిసిల్ల మున్సిపల్ కోఆప్షన్ సభ్యుల ఎన్నిక పక్రియలో భాగంగా కాంగ్రెస్ నేతలు సమావేశాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తూ వితండవాదం చేశారు. ఆ పార్టీ మున్సిపల్ విప్ అడెపు చంద్రకళ మాట్లాడుతూ.. కౌన్సిల్ సమావేశ మందిరంలో వెంటనే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఫొటో పెట్టాలంటూ డిమాండ్ చేయడంతో బీఆర్ఎస్ కౌన్సిలర్లు వారికి దీటుగా సమాధానం చెప్పారు. ఎన్నికల హామీలు అమలుచేశారని ముఖ్యమంత్రి ఫొటో కౌన్సిల్హాల్లో పెట్టాలా?, సిరిసిల్లకు గత ప్రభుత్వంలో మంజూరుచేసిన రూ.40 కోట్ల నిధులు రద్దుచేశారని పెట్టాలా? అంటూ నిలదీశారు. కమిషనర్ కలుగజేసుకొని ఉన్నతాధికారుల సూచన మేరకు పరిశీలనచేస్తామని చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. కోఆప్షన్ సభ్యుల ఎంపికలో గందరగోళం
అధికార పార్టీకి ఏజెంట్లుగా మారారని బీఆర్ఎస్, బీజేపీ కౌన్సిలర్ల ఆరోపణ
వనపర్తి జిల్లా అమరచింత మున్సిపల్ కార్యాలయంలో కోఆప్షన్ సభ్యుల ఎంపికపై సోమవారం నిర్వహించిన సమావేశంలో గందరగోళం నెలకొన్నది. నిర్ణయించిన సమయానికి ఎంపిక చేట్టాలని కమిషనర్‌ను బీఆర్ఎస్, బీజేపీ కౌన్సిలర్లు కోరగా.. మంత్రి శ్రీహరి వచ్చిన తర్వాతే సమావేశం ఏర్పాటు చేస్తామని ఆయన తెగేసి చెప్పారు. దీంతో అధికార పార్టీకి అధికారులు ఏజెంట్లుగా పని చేస్తున్నారని వారు ఆరోపించారు. కాంగ్రెస్ శ్రేణులు మంత్రి వచ్చేవరకు సమావేశం ఏర్పాటు చేయొద్దని కేకలు వేశారు. ఉద్రిక్తత చోటు చేసుకోవడంతో డీఎస్పీ వెంకటేశ్వర్రావు ఆదేశాలతో బీజేపీ కౌన్సిలర్ రాజును పోలీసులు ఈడ్చుకు వెళ్లి.. ఐదు నిమిషాల తర్వాత వదిలి పెట్టారు. కొద్దిసేపటి తర్వాత మంత్రి రాగా వనపర్తి అదనపు కలెక్టర్ కీమ్యానాయక్ అధ్యక్షతన కోఆప్షన్ సభ్యుల ఎంపిక నిర్వహించారు.