హైదరాబాద్, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఉమ్మడి ఏడు జిల్లాల పరిధిలో మరోసారి రాజకీయ సందడి నెలకొననున్నది. మార్చిలో ఒక శాసనమండలి పట్టభద్రుల స్థానం, రెండు ఉపాధ్యాయ నియోజకవర్గ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు ఎన్నికల ప్రక్రియను ఎలక్షన్ కమిషన్ ప్రారంభించింది. పూర్తిస్థాయి ఓటరు జాబితా షెడ్యూల్‌ను విడుదల చేసింది. వచ్చే ఏడాది మార్చి 29తో కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ టీ జీవన్‌రెడ్డి పదవీకాలం ముగియనున్నది. ఇవే జిల్లాల పరిధి టీచర్స్ నియోజకవర్గ ఎమ్మెల్సీ కే రఘోత్తంరెడ్డి, నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల టీచర్స్ నియోజకవర్గ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి పదవీకాలం కూడా ముగియనున్నది. ఆయా నియోజకవర్గాల పరిధిలో సెప్టెంబర్ 30 నుంచి ఓటరు జాబితా దరఖాస్తులను స్వీకరించనున్నారు. డిసెంబర్ 30న తుది ఓటరు జాబితాను ప్రకటిస్తారు. ఫిబ్రవరిలో ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉన్నదని, మార్చిలో ఎన్నికలు ఉంటాయని అంచనా వేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన జాబ్ క్యాలెండర్, ఏడాదిలోపు రెండు లక్షల ఉద్యోగాల భర్తీ, తదితర అంశాలపై ఇప్పటికే నిరుద్యోగ యువత తీవ్ర ఆగ్రహంతో ఉన్న నేపథ్యంలో మూడు ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలు ఆసక్తికరంగా మారనున్నట్టు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఓటరు జాబితా షెడ్యూల్