హైదరాబాద్, మే18 (నమస్తే తెలంగాణ) : కారును పోలిన గుర్తులను కేంద్ర ఎన్నికల సంఘం తొలగించడం పట్ల తెలంగాణ అడ్వకేట్ జేఏసీ నేతలు హర్షం వ్యక్తం చేశారు. 2014 సాధారణ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ.. కారును పోలిన ఆటో గుర్తు ఉండటం వల్ల 2 పార్లమెంట్ స్థానాలు, 5 అసెంబ్లీ స్థానాలను కోల్పోయిందని జేఏసీ నేతలు గోవర్ధన్‌రెడ్డి, సీహెచ్ ఉపేందర్ గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో గండ్ర మోహన్‌రావు సూచనల మేరకు కారును పోలిన ఇతర గుర్తులను తొలగించాలని ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల కమిషన్‌లో పిటిషన్ వేశామని తెలిపారు.
అప్పటి నుంచి ఇదే విషయమై అనేకసార్లు ఎన్నికల కమిషన్‌కు లేఖలు రాస్తూ వస్తున్నామని వివరించారు. 2016, 2017 లో ఢిల్లీకి స్వయంగా వెళ్లి విజ్ఞప్తి చేశామని వివరించారు. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్ కుమార్ కూడా ఇదే విషయంపై ఎన్నికల సంఘాన్ని చాలా సార్లు కలిశారని గుర్తుచేశారు. ఎట్టకేలకు కారును పోలిన ఆటోరిక్షా, టోపీ, ట్రక్, ఇస్త్రీపెట్టె గుర్తులను ఎన్నికల సంఘం తొలగించడం సంతోషించదగ్గ విషయమని పేర్కొన్నారు.