హనుమకొండ చౌరస్తా, నవంబర్ 25: కేంద్ర ఎన్నికల కమిషన్‌కూ కొలీజియం వ్యవస్థను ఏర్పాటు చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అభిప్రాయపడ్డారు. ఎన్నికల కమిషనర్ నియామకంలో కేంద్ర ప్రభుత్వం అత్యుత్సాహాన్ని ప్రదర్శించిందని, ఈ నియామకాన్ని స్వయంగా సుప్రీం కోర్టే తప్పుపట్టిందన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన ఎనిమిదేండ్లలో ఎనిమిది మంది ఎన్నికల కమిషనర్లను మార్చిందని, అందుకే ఈసీకి కూడా కొలీజియం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశా రు.
శుక్రవారం హనుమకొండలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈసీ, ఈడీ, సీబీఐ, ఐటీ లాంటి స్వతంత్రంగా వ్యవహరించాల్సిన రాజ్యాంగ సంస్థలను మోదీ ప్రభుత్వం తన గుప్పిట్లో పెట్టుకుని ప్రతిపక్ష పార్టీల ప్రభుత్వాలపై, ప్రజాప్రతినిధులపై దాడులు చేయిస్తున్నదని విమర్శించారు. ఇది సమాఖ్య వ్యవస్థను దుర్వినియోగం చేసినట్టేనని స్పష్టం చేశారు. గవర్నర్ల వ్యవస్థ రద్దు కోరుతూ డిసెంబర్ 7న సీపీఐ ఆధ్వర్యంలో చలో రాజ్‌భవన్ కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు పేర్కొన్నారు.