హైదరాబాద్, ఆగస్టు 20 (నమస్తే తెలంగాణ): రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కు ప్రశ్నార్థకంగా మారిందని సీపీఐ ప్రధాన కార్యదర్శి డీ రాజా ఆందోళన వ్యక్తంచేశారు. భారత ఎన్నికల సంఘం తటస్థంగా పనిచేయడం లేదని, కాబట్టే ఓటుహక్కు కోసం పెద్ద ఎత్తున ఉద్యమం ప్రారంభమైందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరి ఓటుహక్కు పరిరక్షించబడాలంటే బీజేపీ, ప్రధాని మోదీని అధికారం నుంచి దించివేయాలని అన్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా గాజుల రామారంలోని మహారాజా గార్డెన్స్‌లో మూడు రోజులపాటు జరిగే సీపీఐ రాష్ట్ర 4వ మహాసభలను బుధవారం డీ రాజా ప్రారంభించారు. జాతీయ కార్యదర్శులు డాక్టర్ కే నారాయణ, సయ్యద్ అజీజ్ అతిథులుగా పాల్గొన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ సౌహార్ద్ర సందేశాలు ఇచ్చారు. దేశం ప్రస్తుతం అత్యంత సంక్షిష్టమైన సవాళ్లను ఎదురొంటున్నదని, ప్రాథమిక హకులు, పౌరుల హకుగా ఉన్న ఓటు హకు ప్రశ్నార్థకంగా మారిందని రాజా ఆవేదన వ్యక్తంచేశారు.
త్వరలో ఎన్నికలు జరిగే తమిళనాడు, కేరళ, బెంగాల్ రాష్ట్రాల్లో ఎన్నికల కమిషన్ ఎలా పనిచేస్తుందనేది పెద్ద సమస్య అన్నారు. భారత్ హిందూత్వ దేశం, మతతత్వ రాజ్యాంగా మారితే దేశానికే పెద్ద విపత్తుగా మారుతుందని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఏనాడో హెచ్చరించారని గుర్తుచేశారు. భారతదేశాన్ని కాపాడాలంటే బీజేపీకి, ఆరెస్సెస్‌కు వ్యతిరేకంగా లౌకిక, ప్రజాస్వామ్య శక్తులన్నీ ఐక్యంగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ఉప రాష్ట్రపతి ఎన్నికలో ఇండియా కూటమి అభ్యర్థి జస్టిస్ బీ సుదర్శన్ రెడ్డికి సీపీఐ మద్దతు ప్రకటించిందని, లౌకిక పార్టీలన్నీ ఆయనకు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఆహ్వాన సంఘం అధ్యక్షుడు ఎండీ యూసుఫ్ అధ్యక్షతన జరిగిన ఈ సభలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి, పశ్య పద్మ, జాతీయ సమితి సభ్యులు పల్లా వెంకటరెడ్డి, కే శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.