హైదరాబాద్, ఏప్రిల్ 16 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో ముఖ్య నాయకులకు భద్రత పెంచారు. ఏపీలో సీఎం జగన్పై జరిగిన రాళ్ల దాడి నేపథ్యంలో ఎన్నికల కమిషన్ అప్రమత్తమై ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. రాష్ట్రంలో 17 పార్లమెంట్ నియోజక వర్గాల ఎన్నికలకు ఈ నెల 18 నుంచి నామినేషన్లు ప్రారంభమవుతాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా అన్ని పార్టీల నాయకులు భారీ బహిరంగ సభలు, రోడ్ షోలు, పాదయాత్రలు, డోర్ టు డోర్ ప్రచారాలలో పాల్గొంటారు.
ఈ క్రమంలో అసాంఘిక శక్తుల నుంచి నాయకులను కాపాడేందుకు ఎన్నికల కమిషన్ భద్రత పెంచిందని పోలీసువర్గాల సమాచారం. మంగళవారం సంగారెడ్డి జిల్లా సుల్తాన్పూర్లో సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ముఖ్య నాయకులకు సెక్యూరిటీ పెంచిన విషయం స్పష్టంగా కనిపించింది. సభా ప్రాంగణానికి వెళ్లే దారిలో అడుగడుగునా భద్రతా సిబ్బంది చెకింగ్ చేశారు.