Election Code | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా తనిఖీల్లో భారీగా నగదు, బంగారం పోలీసులకు చిక్కింది. సరైన పత్రాలు లేకుండా తరలిస్తున్న డబ్బు, బంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు తనిఖీలో రూ.130.26కోట్ల విలువైన సొత్తును సీజ్ చేసినట్లు పోలీసు అధికారులు వెల్లడించారు. రూ.130.26కోట్ల విలువైన నగదు, ఆభరణాలు, మద్యం, డ్రగ్స్ సీజ్ చేసినట్లు పేర్కొన్నారు.
తనిఖీల్లో రూ.7.75కోట్లు, రూ.4.58కోట్ల విలువైన డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. అలాగే రూ.40.08కోట్ల విలువైన బంగారు నగలు, వజ్రాలను పట్టుకున్నారు. ఇప్పటి వరకు స్వాధీనం చేసుకున్న కానుకల విలువ రూ.6.29కోట్లు ఉంటుందని, నిన్న ఒకే రోజు తనిఖీల్లో రూ.21.84కోట్ల విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసు అధికారులు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. ఇవాళ సికింద్రాబాద్ స్వప్నలోక్ కాంప్లెక్స్ వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పత్రాలు లేని రెండుకిలోల బంగారు ఆభరణాలు సీజ్ చేసిన పోలీసులు చేశారు. ద్విచక్ర వాహనంపై బంగారాన్ని తరలిస్తుండగా పట్టుకున్నారు.