ములుగు, నవంబర్ 14 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ ములుగు అభ్యర్థి బడే నాగజ్యోతి ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం రెడ్కో చైర్మన్ సతీశ్‌రెడ్డి, అనుచరులతో కలిసి ములుగు మండలం భాగ్యతండాకు చేరుకున్నారు. ఇంటింటి ప్రచారం లో కల్యాణలక్ష్మి పథకానికి ఆద్యులైన కీమానాయక్-రుక్కమ్మ ఇంటికి చేరుకున్నారు. వారు నాగజ్యోతిని ఇంట్లోకి ఆహ్వానించి చీరె, సారె అందించి దీవించారు. నాగజ్యోతి తన వెంట వచ్చిన వారితోపాటు కీమానాయక్ కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా కీమానాయక్ మాట్లాడుతూ.. నాడు ఉద్యమ నేతగా 20 ఏండ్ల కింద కేసీఆర్ వచ్చి తన కూతురు కల్పన పెండ్లిని సొంత ఖర్చులతో చేసి దీవించారని గుర్తుచేశారు.
రెండేండ్ల క్రితం సీఎం హోదా లో తన మనుమరాలు చంద్రకళ పెండ్లి చేయించే బాధ్యతను నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డికి అప్పగించి ఘనంగా జరిగేలా చేశారని కొనియాడారు. ఉద్యమ సమయంలో ఆడపిల్ల పెండ్లి కష్టాన్ని తెలుసుకున్న కేసీఆర్ సీఎం అయ్యాక కల్యాణలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టారని మెచ్చుకున్నారు. కల్పన మాట్లాడుతూ తండ్రి తర్వాత తండ్రిగా తనకు పెండ్లి చేసిన కేసీఆర్ సీఎం అయిన తర్వాత ఏ ఆడబిడ్డకు ఇలాంటి కష్టం రావద్దని కల్యాణలక్ష్మి కింద 1,00,116ను అందించడం గొప్పవిషయమని కొనియాడారు.