హైదరాబాద్, జనవరి 27 (నమస్తే తెలంగాణ): మేయర్, కార్పొరేటర్, చైర్పర్సన్, కౌన్సిలర్ పదవులకు పోటీ చేయాలనుకొనే అభ్యర్థులు ఒకే తరహా అర్హతలు ఉంటే సరిపోతుంది. ఆయా అభ్యర్థులను బలపరిచేందుకు ఒక్క ఓటరు ఉన్నా సరిపోతుంది. ఒకరికి బలపరిచిన వ్యక్తి.. మరో అభ్యర్థిని బలపరచరాదు. ఒకవేళ అదే జరిగితే ఆ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురవుతుంది. రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికల షెడ్యూల్ విడుదలవడంతో నగరాలు, పట్టణాల్లో సందడి మొదలైంది. ఆయా పదవులకు పోటీ చేయాలనుకొనే ఆశావహులు ఇప్పటికే సర్వం సిద్ధం చేసుకునే పనిలో పడ్డారు. అవసరమైన ధ్రువీకరణ పత్రాలను, బలపరిచే వ్యక్తులను సిద్ధం చేసుకుంటున్నారు. ప్రచార వ్యయాల కోసం ఏర్పాట్లు చేసుకుంటున్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు చెప్పిన వివరాల ప్రకారం.. అభ్యర్థులు పాటించాల్సిన నియమ, నిబంధనలు, ఉండాల్సిన అవగాహన, సూచనలు కింది విధంగా ఉన్నాయి.
ఎవరు పోటీ చేయవచ్చు?
మేయర్, కార్పొరేటర్, చైర్పర్సన్, కౌన్సిలర్ పదవులకు పోటీ చేయాలనుకొనే అభ్యర్థికి కనీసం 21 సంవత్సరాల వయసు నిండి ఉం డాలి. సంబంధిత వార్డులో లేదా డివిజన్లో ఓటరై ఉండాలి. ఏ కోర్టు ద్వారా అనర్హత ఆదేశాలు వచ్చి ఉండరాదు. ఏదైనా పార్టీ నుంచి పోటీచేసే అభ్యర్థికైనా, స్వతంత్ర అభ్యర్థికైనా ఒక్కరు ప్రతిపాదిస్తే సరిపోతుంది. ఏ వార్డుకు పోటీ చేస్తున్నారో ఆ వార్డుకు చెందిన ఓటర్లు అయి ఉండాలి. పార్టీనుంచి పోటీచేసే వ్యక్తి ఆ పార్టీ బీ ఫామ్ అందజేయాలి. నామినేషన్ ఫామ్‌తోపాటు అభ్యర్థులు అఫిడవిట్ సమర్పించాల్సి ఉంటుంది. ఆ అభ్యర్థికి పార్టీకి సం బంధించిన ఎన్నికల గుర్తువస్తుంది. ఎన్నికల అధికారి ఇచ్చే ఫ్రీ సింబల్‌ను ఎంచుకోవాలి. వీరు కూడా నామినేషన్ ఫామ్‌తోపాటు అఫిడవిట్ ఇవ్వాలి. పోటీచేసే అభ్యర్థికి మున్సిపల్ పరిధిలో ఓటు ఏ వార్డులో ఉన్నా అదే వార్డు లో లేదా ఇతర వార్డులో పోటీ చేయవచ్చు. కానీ, ఏ వార్డుకు పోటీచేస్తే అదే వార్డుకు చెం దిన వ్యక్తి మాత్రమే బలపరచాలి.
ప్రచార ఖర్చులపై నిఘా
ప్రచార ఖర్చులపై అధికారులు గట్టి నిఘా ఉంచుతారు. ప్రతి రూపాయి లెకలో ఉం టుంది. అయితే పార్టీ ఆఫీస్ అద్దె, కరెంట్ బి ల్లు, అక్కడి సిబ్బంది జీతాలు, సాధారణ నిర్వహణ ఖర్చులను మాత్రం ఎన్నికల ప్రచార ఖర్చుగా లెక్కించరు. అభ్యర్థి వ్యక్తిగత జీవన ఖర్చులు ఎన్నికలకు సంబంధం లేని ఖర్చులు అంటే.. ఇంటి అద్దె, ఇంటి కరెంట్/నీటి బిల్లు లు, కుటుంబ భోజన ఖర్చులు, పిల్లల చదువు ఖర్చులు ప్రచార ఖర్చు కిందికి రావు. కానీ, పార్టీ ఆఫీస్ నుంచే అభ్యర్థి కోసం ప్రత్యేక ప్రచారం చేస్తే ఆ ఖర్చు మాత్రం అభ్యర్థి ఖర్చులోకే వస్తుంది. మత,సంప్రదాయ కార్యక్రమా ల ఖర్చులు ఎన్నికల ప్రచారం చేయనప్పుడు మాత్రమే.. పూజలు, పెళ్లి,శుభకార్యాలు, అంత్యక్రియలు.. కానీ, అకడ కూడా ప్రచా రం చేస్తే ఎన్నికల ఖర్చులోకే వస్తుంది. అభ్యర్థి అనుమతితో లేదా ఆదేశంతో జరిగిన ప్రతి ఖర్చు, కచ్చితంగా లెకలోకి వస్తుంది. పార్టీ చేసింది అనే కారణం చెప్పి తప్పించుకోలేరు.
ఎన్నికల ఖర్చుల తనిఖీ తప్పనిసరి
వ్యయంపై ఎన్నికల పరిశీలకులు గట్టి నిఘా ఉంచుతారు. ఖర్చుల రిజిస్టర్ మెయింటైన్ చేస్తున్నారా? ప్రతి ఖర్చుకూ బిల్, రసీదు ఉన్న దా? ఖర్చు పరిమితి దాటిందా? పార్టీ చేసిన ఖర్చు మీ ఖర్చులో చూపించారా? సోషల్ మీడియా ఖర్చులు చూపించారా? వాహనాలు ఎన్ని? అనుమతి తీసుకున్నారా? వాహనాలపై ఫ్లెక్సీలకు అనుమతి ఉన్నదా? ర్యాలీ లు, రోడ్ షోలకు అనుమతి తీసుకున్నారా? వంటివి పరిశీలిస్తారు.
ప్రచార సరళిపైనా నిఘా
అభ్యర్థుల ప్రచార సరళిపై ఎన్నికల అధికారుల నిఘా ఉంటుంది. సభలు, సమావేశాలు అనుమతితో పెట్టారా? లేదా? అనేది పరిశీలిస్తారు. ప్రభుత్వ ఆస్తులపై ప్రచారం చేపడితే నేరం అవుతుంది. సభ పరిమాణం, సంఖ్య అనుమతి మేరకేనా? సభకు ముందే అనుమతి తీసుకున్నారా? ఓటర్లకు డబ్బులు, వస్తువులు, మద్యం పంపిణీ జరిగిందా? వంటివి పరిశీలిస్తారు. సోషల్ మీడియా ప్రచారంపై నిఘా పెడతారు. పెయిడ్ యాడ్స్ ఉంటే వాటి ఖర్చు రిజిస్టర్లో చూపారా అనేది చూస్తారు.
మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలు కీలకం
ఎన్నికల ప్రక్రియలో కోడ్ చాలా కీలకమైనది. అభ్యర్థి ప్రభుత్వ పథకాలను ప్రచారానికి వాడారా?అధికారులను ప్రభావితం చేశారా? మత/కుల ప్రాతిపదికన ప్రచారం చేశారా? ప్రత్యర్థులపై అసభ్య వ్యాఖ్యలు చేశారా? అనే అంశాలను పరిశీలిస్తారు. కోడ్‌ను ఉల్లంఘిస్తే సదరు అభ్యర్థి ఎన్నికను రద్దు చేయడం, అనర్హత వేటు వంటివి ఉంటాయి.
ప్రచార ఖర్చు లక్ష దాటొద్దు
మున్సిపాలిటీల్లో పోటీచేసే అభ్యర్థి లక్ష మాత్రమే ఖర్చు చేయాలనే నిబంధన ఉన్నది. కార్పొరేషన్ పరిధిలో బరిలో నిలి చే అభ్యర్థి రూ.1.50 లక్షల వరకు ప్రచారానికి ఖర్చుచేయవచ్చు. ఫ్లెక్సీలు, బ్యాన ర్లు, కరపత్రాలు, పోస్టర్లు, వాహనాల అద్దెలు, మైక్, డీజే, సభలు, సమావేశాల ఖర్చు, సోషల్ మీడియా ప్రచారం, కార్యకర్తలకు భోజనం, నీళ్లు, పార్టీ చేసిన ఖర్చు అభ్యర్థి ఖర్చుగానే లెక్కిస్తారు. ప్రతి అభ్యర్థి ఎన్నికల ప్రచార ఖర్చుల రిజిస్టర్ నిర్వహించాలి. ఎన్నికల అధికారికి మధ్య లో, ఎన్నికల తర్వాత 30 రోజుల్లోపు ఖర్చుల రిజిస్టర్‌ను చూపాలి. ఒకవేళ ఎస్ఈసీ నిర్దేశించిన ప్రచార ఖర్చుల పరిమితి మించితే.. ఎన్నిక రద్దు కావచ్చు. అనర్హత వేటుపడే ప్రమాదం కూడా ఉన్నది. భవిష్యత్తులో పోటీ చేయకుండా నిషేధం విధించే అవకాశం కూడా ఉంటుంది.
నామినేషన్‌కు కావాల్సిన పత్రాలు ఏమిటి?
ఎన్నికల అధికారి నుంచి పొందిన నామినేషన్ ఫామ్ ఉండాలి. అఫిడవిట్లో ఆస్తులు, కేసుల వివరాలు పొందుపర్చాలి. పోటీచేసే అభ్యర్థి ఓటర్ఐడీ/ఆధార్ కార్డును జతచేయాలి. పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలు (అవసరానికి తగ్గట్టు) పెట్టాలి. పార్టీ అభ్యర్థి అయితే పార్టీ బీ ఫామ్ జతపర్చాలి. నామినేషన్ సమయంలో డిపాజిట్ (జమ చేయాల్సిన మొత్తం) ఎన్నికల నోటిఫికేషన్ ప్రకారం చెల్లించాలి. పోలైన ఓట్లలో 15.3 శాతం కంటే తకువ ఓట్లు వస్తే డిపాజిట్ జప్తు అవుతుంది. నామినేషన్ ఫామ్‌ను ఎలాంటి తప్పులు లేకుండా అన్ని అంశాలను నింపాల్సి ఉంటుంది. చిన్న తప్పు జరిగినా నామినేషన్ తిరస్కరణకు గురవుతుంది.