హైదరాబాద్, సెప్టెంబర్ 6(నమస్తే తెలంగాణ): నిబంధనలకు విరుద్ధంగా సబ్ రిజిస్ట్రార్లను అరెస్టు చేయడం, అక్రమ కేసులు బనాయించడాన్ని ఆపేయాలని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఉద్యోగుల సంఘం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. బాధ్యతల నిర్వహణలో ఉన్న సబ్ రిజిస్ట్రార్లపై పోలీసులు కేసులు నమోదు చేయాలన్నా, అరెస్టు చేయాలన్నా శాఖాధిపతి (కమిషనర్ అండ్ ఇన్స్పెక్టర్ జనరల్) ముందస్తు అనుమతి తప్పనిసరని సంఘం నేతలు పేర్కొన్నారు. నిబంధనలను తుంగలో తొక్కి పోలీసులు ఏకపక్షంగా అక్రమ అరెస్టులు చేయడం తీవ్ర ఆక్షేపణీయమని మండిపడ్డారు. ఇలాంటి చర్యలు ఉద్యోగుల మానసిక ైస్థెర్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తున్నాయని, వీటిని ఖండిస్తున్నట్టు తెలిపారు.
ఆదివారం హైదరాబాద్‌లో తెలంగాణ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఉద్యోగుల రాష్ట్ర స్థాయి కీలక సమావేశం జరిగింది. సమావేశానికి అసోసియేషన్ అధ్యక్షుడు స్థితప్రజ్ఞ అధ్యక్షత వహించగా, కన్వీనర్ హరికోట్ల రవి, ప్రధాన కార్యదర్శి సిరాజ్ అన్వర్, కోశాధికారి నరేశ్‌గౌడ్, టీజీవో కోశాధికారి సహదేవ్, డీఐజీలు ట్వింకిల్ జాన్, తులసి గార్లతోపాటు జిల్లా రిజిస్ట్రార్లు రవీందర్రావు, శ్రీనివాస్, ఏఐజీ చారి, సబ్ రిజిస్ట్రార్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు కీలక తీర్మానాలు చేశారు. గత 20 ఏండ్లుగా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు, ప్రభుత్వానికి వచ్చే ఆ దాయం భారీగా పెరిగినప్పటికీ, అందుకు తగినట్టుగా సిబ్బంది సంఖ్యను పెంచలేద ని, వెంటనే పని భారానికి అనుగుణంగా శాఖను పునర్వ్యవస్థీకరించాలని ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానం చేశారు. ఏడాదికి పైగా పెండింగ్‌లో ఉన్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలను తక్షణమే విడుదల చేయాలని కోరారు.