హైదరాబాద్, ఆగస్టు 23 (నమస్తే తెలంగాణ): పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన ఎల్ నినో ప్రభావం క్రమంగా బలపడుతున్నది. దీంతో భారత్‌లో నైరుతి రుతుపవనాలు బలహీనపడటం ప్రారంభమైంది. బంగాళాఖాతంలో అప్పుడప్పుడూ అల్పపీడనాలు ఏర్పడుతున్నా.. అవి బలపడుతున్న సూచనలు కనిపించడం లేదు. దీంతో అల్పపీడన వర్షాలు కూడా తగినంతగా కురువడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో భారత వాతావరణ విభాగం మరో కీలక ప్రకటన చేసింది. సాధారణంగా అయితే దేశంలో రుతుపవనాలు ప్రస్తుతం చాలా చురుగ్గా ఉండాలి. కానీ పరిస్థితి రివర్స్ అయ్యి బలహీన పడుతున్నట్టు అధికారులు తెలిపారు.
కనీసం రాబోయే రెండు వారాలపాటు అంటే సెప్టెంబర్ 2 వరకు దేశవ్యాప్తంగా సాధారణం కంటే తకువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నదని వెల్లడించారు. రుతుపవన ద్రోణి మధ్య భారతదేశం మీదుగా కదలడానికి బదులుగా హిమాలయ పాదాల వద్దే స్థిరంగా ఉండిపోవడంతో, ఇప్పటికే సగటు కంటే 14% తకువగా ఉన్న దేశవ్యాప్త వర్షపాత లోటు మరింత పెరిగే ప్రమాదం పొంచి ఉన్నదని పేర్కొన్నారు.
ప్రైవేట్ వాతావరణ అంచనా సంస్థ సైమెట్ వెదర్ కూడా తన సవరించిన అంచనాలో రుతుపవన వర్షపాతం ఇప్పుడు దీర్ఘకాల సగటులో కేవలం 85% మాత్రమే ఉంటుందని తేల్చేసింది. ఏప్రిల్‌లోని 94% అంచనాతో పోలిస్తే ఇది తకువ. అలాగే కరువు వచ్చే అవకాశాలు 70% ఉన్నట్టు తెలిపింది. ఆగస్టులో మిగిలిన వారాల్లో దేశంలోని నాలుగు ఏకరీతి వర్షపాత ప్రాంతాల్లో అసమాన పంపిణీ ఉంటుందని సైమెట్ హెచ్చరించింది. బలపడుతున్న ఎల్ నినో, బలహీనపడిన హిందూ మహాసముద్ర ద్విధ్రువం కారణంగా సెప్టెంబరులో ఈ లోటు మరింత తీవ్రమవుతుందని అంచనా. తాజా పరిణామాల ప్రభావం వ్యవసాయం, ధరలపై తీవ్రంగా ఉంటుందనే హెచ్చరికలు వెలువడుతున్నాయి.