పెద్దపల్లి, ఫిబ్రవరి 27 (నమస్తే తెలంగాణ): రెక్కాడితే గానీ డొక్కాడని ఓ పేదింటి బిడ్డకు తెలంగాణ ప్రభుత్వ స్టడీ సర్కిల్ ఓ దారి చూపింది. కరీంనగర్, హైదరాబాద్ ప్రభుత్వ స్టడీ సర్కిళ్లలో మూడేళ్లపాటు శిక్షణ పొంది 8 ఉద్యోగాలు సాధించారు పెద్దపల్లి జిల్లా రామగుండం నగరానికి చెందిన బట్టారి ధనుంజయ్. స్థానిక హౌజింగ్ బోర్డు కాలనీకి చెందిన బట్టారి నర్సింగం-తిరుమల దంపతులకు ముగ్గురు కొడుకులు. ధనుంజయ్ మొదటివాడు. తండ్రి సెంట్రింగ్ పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తుండగా, అమ్మ కూలీ పనులకు వెళ్లేది. 2012లో ఎంబీఏ పూర్తిచేసిన ధనుంజయ్.. నాలుగేండ్లపాటు ప్రైవేటు రంగంలో డాటా ఎంట్రీ ఆపరేటర్‌గా పనిచేశారు. ఓ వైపు ప్రైవేటు ఉద్యోగం చేస్తూనే సివిల్స్ కోచింగ్ తీసుకొన్నారు. ఈ క్రమంలో 2017 ఫిబ్రవరి నుంచి జూలై వరకు కరీంనగర్ స్టడీ సర్కిల్లో, 2017 జూలై నుంచి 2019 జూన్ వరకు హైదరాబాద్ స్టడీ సర్కిల్లో శిక్షణ తీసుకొని గ్రూప్స్‌కు ప్రిపేరయ్యారు.
కొలువుల బాటలో..
నిరుపేద కుటుంబానికి చెందిన ధనుంజయ్ స్టడీ సర్కిల్ ప్రోత్సాహంతో ఎనిమిది ఉద్యోగాలు సాధించారు. 2019 జూలైలో ఒకేసారి పంచాయతీ కార్యదర్శి, వీఆర్ఏ ఉద్యోగం సాధించారు. 2021 జనవరిలో ఇరిగేషన్ శాఖలో జూనియర్ అసిస్టెంట్‌గా ఉద్యోగం పొందారు. తర్వాత గ్రూప్ 4 (జూనియర్ అసిస్టెంట్), అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్, ఆర్టీసీలో జూనియర్ అసిస్టెంట్, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులో గ్రూప్ డి ఉద్యోగం, ఆ తర్వాత ఇస్రోలో ఎల్డీసీ ఉద్యోగం దక్కించుకొన్నారు. తాజాగా పీవీ నరసింహారావు వెటర్నరీ యూనివర్సిటీలో సీనియర్ అసిస్టెంట్‌గా ఉద్యోగం లభించింది. పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్నారు.
స్టడీ సర్కిల్ వల్లే విజయాలు
తెలంగాణ ప్రభుత్వ స్టడీ సర్కిల్లో శిక్షణ ద్వారానే నేను ఇన్ని విజయాలు సాధించగలిగాను. మొదట కరీంనగర్‌లోని తెలంగాణ స్టేట్ షెడ్యూల్ కులాల స్టడీ సరిల్లో కోచింగ్ తీసుకొన్నాను. ఆ తర్వాత హైదరాబాద్ స్టడీ సర్కిల్లో చేరాను. అక్కడి శిక్షణల ఫలితంగానే నాకు ఉద్యోగాలు వచ్చాయి. సివిల్ సర్వీసెస్ సాధించడమే నా లక్ష్యం. నిరుద్యోగులు నిరాశ నిస్పృహకు లోనుకాకుండా, చిత్తశుద్ధితో ప్రణాళికా ప్రకారం చదివితే విజయం తప్పక లభిస్తుంది. ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను మనం సద్వినియోగం చేసుకొని మన ఆశయాలను లక్ష్యాలను సాధించుకోవాలి.
– బట్టారి ధనుంజయ్, రామగుండం పెద్దపల్లి జిల్లా