Eggs Price | హైదరాబాద్, డిసెంబర్ 1 (నమస్తేతెలంగాణ): ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతుండగా, తాజాగా కోడిగుడ్ల ధరలు అమాంతం పెరిగాయి. హోల్‌సేల్ మారెట్లో ఒకో గుడ్డు రూ.5.90 ఉండగా, రిటైల్‌గా రూ.7 వరకు పలుకుతున్నది. ప్రస్తుతం డజను గుడ్ల ధర బహిరంగ మారెట్ రూ.80 నుంచి రూ.84 వరకు ఉండడంతో సామాన్య, మధ్యతరగతి ప్రజలు ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొన్నది.
ఈ ఏడాది జనవరిలో ఒకో కోడిగుడ్డు ధర రూ.7 వరకు పలికింది. మూడు నెలల తర్వాత.. రూ.3 తగ్గి రూ.4 నుంచి రూ.4.50 వరకు విక్రయించారు. గత నాలుగు నెలలుగా గుడ్ల ధరలు మళ్లీ పెరుగుతూ వచ్చాయి. ఆగస్టులో ఒకో గుడ్డు ధర రూ.6 నుంచి రూ.6.50 ఉండగా, నెల క్రితం తగ్గిన గుడ్డు ధరలు మళ్లీ పెరిగాయి.
కేసు(30) గుడ్లను కొన్ని ప్రాంతాల్లో 190 నుంచి రూ.200 వరకు విక్రయిస్తుండడంతో.. కేసు గుడ్ల ధర కంటే కేజీ చికెన్ ధర తక్కువగా ఉండటం గమనార్హం. ప్రస్తుతం కేజీ చికెన్ రూ.180 వరకు విక్రయిస్తున్నారు. క్రిస్మస్, న్యూఇయర్ సందర్భంగా కేకుల తయారీకి పెద్దఎత్తున గుడ్లను వినియోగించనుండడంతో వాటి ధర మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు పేర్కొంటున్నారు.