హైదరాబాద్, మే 14 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో చికెన్ ధరతో పాటు కోడిగుడ్డు ధర కూడా కొండెకి కూర్చుంది. ప్రస్తుతం కేజీ చికెన్ రూ.270 నుంచి రూ.300 పలుకుతుండగా, గుడ్డు ధర కూడా విపరీతంగా పెరిగింది. నెల రోజుల వ్యవధిలో ఫాం వద్ద గుడ్డు ధర సుమారు 90 పైసలు పెరిగినట్టు వ్యాపారులు చెప్తుతున్నారు. గత నెల ఏప్రిల్ 13న గుడ్డుధర రూ.4.45 పైసలు ఉండగా.. ప్రస్తుతం రూ.5.35కు చేరింది. రిటైల్ మారెట్లో చిల్లరగా ఒక గుడ్డును రూ.6.50 నుంచి రూ.7 వరకు వ్యాపారులు విక్రయిస్తున్నారు.
అధిక పోషకాలుండే గుడ్డును నిత్యం ఆహారంలో తీసుకొనే చాలా మంది పెరిగిన ధరల కారణంగా గుడ్డును కొనుగోలు చేయలేక, ఆకుకూరల వైపు చూస్తున్నారు. డిమాండ్‌కు తగ్గట్టుగా సరఫరా లేకపోవడంతో గుడ్డు ధరలు పెరిగినట్టు వ్యాపారులు చెప్తున్నారు. రికార్డు స్థాయిలో నమోదవుతున్న ఉష్ణోగ్రతల కారణంగా గుడ్లు పెట్టే లేయర్ కోళ్ల మరణాలు ఎకువగా ఉంటున్నాయి.దీంతో మారెట్లో గుడ్ల కొరత ఏర్పడింది.
సాధారణంగానే వేసవిలో లేయర్ కోళ్లు వడగాడ్పుల కారణంగా తకువ దాణా తీసుకొంటాయి. కొన్ని కోళ్లు ఎండ తీవ్రతకు తట్టుకోలేక మృత్యువాతపడుతుంటాయి. తద్వారా గుడ్ల ఉత్పత్తి తగ్గుతుంది. ఈ ప్రభావమే ప్రస్తుతం మారెట్ పై పడింది. దీంతో గుడ్ల కొరత ఏర్పడటంతో పాటు ధర పెరిగింది. గుడ్ల ధరలు తగ్గాలంటే మరో రెండు నెలలు ఆగాల్సిందేనని ఫౌల్ట్రీ వ్యాపారులు చెప్తున్నారు. వాతావరణం చల్లబడి లేయర్ కోళ్లు చనిపోకుండా ఉంటే గుడ్ల ఉత్పత్తి పెరుగుతుందని అంటున్నారు.
ఆ తర్వాత సప్లయ్ పెరిగి ధరలు అదుపులోకి వస్తాయని అంటున్నారు. రాష్ట్రంలో ప్రతి రోజు 3.7 కోట్ల గుడ్లు ఉత్పత్తి అవుతున్నాయి. వీటిలో 1.7 కోట్లు ఇతర రాష్ర్టాలకు ఎగుమతి అవుతున్నాయి. ముఖ్యంగా, రాష్ట్రం నుంచి మహారాష్ట్ర, బీహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌కు గుడ్ల సరఫరా అవుతున్నాయి. రాష్ట్రంలో సగటున ఒక మనిషి రోజుకు 1.5 గుడ్లు వినియోగిస్తున్నట్టు మార్కెటింగ్ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.