Minister Ponguleti | హైదరాబాద్, ఆగస్టు 31 (నమస్తే తెలంగాణ): సొంత పార్టీలోనే మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి టార్గెట్ అయ్యారా? సొంత ప్ర భుత్వంలోనే ఆయన ప్రాధాన్యం తగ్గించే ప్ర యత్నాలు జరుగుతున్నాయా? రాజకీయంగా ఇరుకునపెట్టేలా, ఆయన ఇమేజ్ డ్యామేజ్ చేసేలా కొందరు ఎత్తులు వేస్తున్నారా? అంటే పలు సంఘటనలు అవును! అన్న ప్రచారానికి ఊతమిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు ముం దు ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ ఎన్ని సీట్లు గెలవబోతున్నదో తొడగొట్టి సవాల్ చేసి చెప్పిన రెవెన్యూ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అదే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉక్కపోతకు గురవుతున్నట్టు ఆ పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది. పైకి అంతా బాగానే కనిపించినా ప్రభుత్వంలో ఆయన ప్రాధాన్యాన్ని తగ్గించే ప్రయత్నాలు జరుగుతున్నట్టు వదంతులు పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. నోటితో నవ్వి నొసటితో వెక్కిరిస్తున్న పరిస్థితులను ఆయన గమనిస్తున్నా.. ఇటు ఆస్వాదించలేక, అటు అడ్డుకోలేక అంతర్మథనం చెందుతున్నట్టు ప్రచారం జరుగుతున్నది. ప్రజా పనులకు అట్టహాసంగా ఆదేశాలిస్తున్నా అవి పూర్తిస్థాయిలో అమలు కాకపోవడం అనేక అనుమానాలకు తావిస్తున్నది.
తొలినాళ్లలో అంతా ఆయనదే అన్నట్టు..
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటానికి కొద్దినెలల ముందు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరి ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి.. పార్టీలో కీలక నేత గా మారారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆయనకు అత్యంత కీలకమైన రెవె న్యూ, సమాచార, గృహనిర్మాణశాఖలను కట్టబెట్టారు. ప్రభుత్వం ఏర్పడిన తొలినాళ్లలో అం తా ఆయనదే నడిచినట్టు, ఆయన మాటే శిరోధార్యం అన్నట్టుగా కనిపించినా ప్రస్తుతం ఆ పరిస్థితులు మాయమైతున్నట్టు పార్టీ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతున్నది. రాజకీయాల్లో ఒంటరిగా 2014లో రంగప్రవేశం చేసిన పొం గులేటి.. క్రమేణా తన బలాన్ని, బలగాన్ని పెం చుకునే ప్రయత్నం చేయటం, కీలకమైన వ్యక్తి గా, శక్తిగా ఎదిగేలా తన వ్యవహారశైలి ఉండటంతో ఆయన వేగానికి కళ్లెం వేసేలా ప్రభుత్వ పెద్దలు వ్యవహరిస్తున్నట్టు ప్రచారం జరుగుతున్నది.
ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఖమ్మం పార్లమెంట్ స్థానం నుంచి కాంగ్రెస్ టికెట్‌ను తన సోదరుడు పొంగులేటి ప్రసాద్‌రెడ్డికి ఇవ్వాలని ఢిల్లీ స్థాయిలో ఆయన భారీ ప్రయత్నాలు చేశారు. ఒక దశలో ఆయనకే టికెట్ ఖరారు అయిందన్న ప్రచారం సైతం జరిగింది. ఢిల్లీలో చక్రం తిప్పగలిగే ఆయన శక్తిని గమనించిన పార్టీ ప్రభుత్వ పెద్దలు.. రాజకీయంగా మరింత బలోపేతం కాకుండా చక్రం తిప్పి పొంగులేటి ప్రసాద్‌రెడ్డికి కాకుండా పొంగులేటి వియ్యంకుడు రామసాయం రఘురాంరెడ్డికి టికెట్ వచ్చేలా చేశారని అప్పట్లో భారీగా ప్రచారం జరిగింది. పొంగులేటిని ప్రభుత్వ వ్యవహారాలకే పరిమితం చేయాలన్న లక్ష్యంతో ఆయనకు లభించే అవకాశాలను అడుగడుగునా అడ్డుకుంటున్నట్టు చర్చ జరుగుతున్నది. తాజాగా టీపీసీసీ అధ్యక్షుడి నియామకంలో రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు ఢిల్లీ నుంచి పిలుపు వచ్చింది. సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూ టీ సీఎం భట్టివిక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరుల అభిప్రాయాలను పార్టీ అధిష్ఠానం తెలుసుకున్నది. పొంగులేటికీ ఢిల్లీ నుంచి పిలుపు వస్తుందని ఆయన అనుచరులు భావించినా, కొందరు పార్టీ పెద్దలు, ప్రభుత్వ పెద్దలు ఆ పిలుపు అందకుండా చేశారన్న విమర్శలు పార్టీలో వెల్లువెత్తుతున్నాయి.
వెంటాడుతున్న పలు వివాదాలు
మంత్రిగా బాధ్యతలు స్వీకరించాక పలుసార్లు వివాదాస్పద సంఘటనల ద్వారా పొంగులేటి వార్తల్లో నిలిచారు. అత్యంత ఖరీదైన విదేశీ వాచీలను తన కుమారుడు కొనుగోలు వ్యవహారం వివాదాస్పదమైంది. దీనిపై ఆయన ప్రభుత్వ పెద్దలకు వివరణ ఇచ్చుకున్నట్టు ప్రచారం. అది మర్చిపోకముందే తన రాఘవ కన్స్ట్రక్షన్స్ నుంచి చేసే కాంట్రాక్టు పనులకు విదేశీ బ్యాంకులు బ్యాంకు గ్యారంటీ ఇవ్వడం మంత్రిని మరోసారి వార్తల్లో నిలిపింది. ఈ ఘటనలు స్వతహాగా జరిగినవి కావని, పొంగులేటి ఇమేజ్ను డ్యామేజ్ చేసేందుకు పార్టీలోని, ప్రభుత్వంలోని కొందరు ఇబ్బం ది పెడుతున్నారని ఆయన అనుచరవర్గంలో అభిప్రాయం వ్యక్తమవుతున్నది. వారి సందేహాలకు బలం చేకూర్చేలా హైదరాబాద్‌లోని హిమాయత్‌సాగర్‌లో సొంతింటి నిర్మాణం పై ఆరోపణలు రావడం.. హైడ్రా వాటిపై దృష్టి సాధించాలని పెద్దఎత్తున డిమాండ్లు తలెత్తడంతో ఈ వ్యవహారంపై స్వయంగా పొంగులేటి మీడియాతో వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఈ పరిస్థితికి ప్రభుత్వంలోని కొందరి అదృశ్య హస్తమే కారణమన్న అభిప్రాయం బలంగా వినిపిస్తున్నది.
పొంగులేటి ఇంటిపై విమర్శలు రాగానే.. అక్రమ నిర్మాణాలు ఎవరు చేసినా సహించేది లేదని, హైడ్రా తన పని తాను చేసుకుపోతుందని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. పైగా, సీఎం సోదరుడు నిర్మించుకున్న ఇంటిపై ఆరోపణలు రావడంతో అధికారులు తక్షణం స్పందించి నోటీసులు జారీ చేయడం వంటి చర్యలు పొంగులేటిని రాజకీయంగా ఇరుకునపెట్టడానికేనన్న అభిప్రాయం కాంగ్రెస్ పెద్దల్లో వ్యక్తమవుతున్నట్టు తెలుస్తున్నది. ఆయనకు అడుగడుగునా అడ్డంకులు సృష్టించే ప్రయత్నం జరుగుతున్నట్టు వారిలో చర్చ జరుగుతున్నది. తన జిల్లా, తన నియోజకవర్గానికి సంబంధించి ప్రజా పనులు చేయాలని కొంతమంది మంత్రులకు ఆయన ఫైళ్లు పంపి నెలలు గడుస్తున్నా వాటికి మోక్షం కలగడం లేదని ప్రచారం జరుగుతున్నది. సమాచార మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే సమాచారశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ కార్యాలయాన్ని సూర్యాపేట నుంచి ఖమ్మం తరలించాలని నిర్ణయం తీసుకున్నారు. దీనిపై శాఖ అధికారులతో ఉత్తర ప్రత్యుత్తరాలు నడిపారు. ఆ ఫైల్ ఇప్పటికీ క్లియర్ కాకపోవటాన్ని ఉదహరిస్తున్నారు. మరోవైపు సమీక్షల్లో పొంగులేటి వాడే పరుష పదజాలాన్ని అధికారులు ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లినట్టు ప్రచారం. చిన్నబుచ్చుకొనే వ్యాఖ్యల పై ఫిర్యాదు చేసినట్టు తెలిసింది.