ముషీరాబాద్, మార్చి 17: దళిత సాధికారత కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న కృషి అభినందనీయమని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్, జాతీయ అధ్యక్షుడు మేడి పాపయ్య అన్నారు. దవాఖానలకు పోషకాహారం అందించే సంస్థలతో పాటు, పారిశుద్ధ్య, భద్రత సిబ్బంది నిర్వహణ సంస్థల్లో ఎస్సీలకు 16 శాతం రిజర్వేషన్లను వర్తింపజేయడంపై హర్షం వ్యక్తంచేశారు. గురువారం వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావును ఆయన చాంబర్లో కలిసి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఎమ్మార్పీఎస్ నేతలు మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ దళితబంధు లాంటి విప్లవాత్మక పథకాలతో దళితుల అభివృద్ధి కోసం కృషిచేస్తున్నారని చెప్పారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రిజర్వేషన్లను ఎత్తి వేసే కుట్ర చేస్తున్నదని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్‌ను నిర్వీర్యం చేయాలని చూస్తున్నదని కేంద్రంపై ధ్వజమెత్తారు. బీజేపీ ప్రభుత్వం దళిత, బీసీ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నదని విమర్శించారు.