హైదరాబాద్, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో పర్యావర పరిరక్షణకు కేసీఆర్ ప్రభుత్వ హయాంలో విశేష కృషి జరిగిందని అంతర్జాతీయ సదస్సు ప్రశంసించింది. మధ్య ప్రదేశ్లోని చిత్రకూట్లో ఆదివారం ఈ సదస్సును నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వంతోపాటు బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫీషియెన్సీ ఆధ్వర్యంలో జరిగిన ఈ సదస్సులో వక్తలు ప్రసంగిస్తూ.. భూతాపాన్ని, గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలను తగ్గించేందుకు గత పదేండ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చూపిన చొరవను కొనియాడారు. పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో ఎల్ఈడీ వీధి దీపాల ఏర్పాటుతోపాటు పలు ఇతర కార్యక్రమాల ద్వారా విద్యుత్తు వినియోగాన్ని తగ్గించడంలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని పేర్కొన్నారు.
ఎనర్జీ ఎఫీషియెన్సీ సర్వీస్ లిమిటెడ్ (ఈఈఎస్ఎల్)తో ఒప్పందాలు కుదుర్చుకుని జీహెచ్ఎంసీ పరిధిలో 5.48 లక్షల ఎల్ఈడీ వీధి దీపాలను ఏర్పాటు చేయడం వల్ల 236.19 మిలియన్ యూనిట్ల విద్యుత్తు ఆదా అవడంతోపాటు గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలు గణనీయంగా తగ్గినట్టు తెలిపారు. ఎనర్జీ కన్జర్వేషన్ బిల్డింగ్ కోడ్ (ఈసీబీసీ)ను అమలు చేయడంలో గత ప్రభుత్వం చూపిన చొరవను ప్రత్యేకంగా అభినందించారు. దేశంలోనే తొలిసారి తెలంగాణలో ఈసీబీసీని మున్సిపల్ చట్టంలో విలీనం చేశారని కొనియాడారు.
నగరాలు, పట్టణాల్లో ఉష్ణ ప్రభావాన్ని తగ్గించేందుకు, ఇంధన సంరక్షణకు కూల్ రూఫ్ పాలసీని తీసుకురావడం బీఆర్ఎస్ ప్రభుత్వ దూరదృష్టిని ప్రతిబింబిస్తున్నదని కొనియాడాడుతూ.. దేశంలోని అన్ని నగరాల్లో ఈ విధానాన్ని అమలు చేయాలని సూచించారు. పర్యావరణ లక్ష్యాలను సాధించడం ద్వారా భవిష్యత్తు తరాలకు మంచి వాతావరణాన్ని అందించేందుకు బీఆర్ఎస్ సర్కారు చేసిన కృషి అనిర్వచనీయని శ్లాఘించారు. పర్యావరణ పరిరక్షణకు తెలంగాణతో పాటు దక్షిణాది రాష్ర్టాలు పెద్దపీట వేశాయని గుర్తు చేశారు.