హైదరాబాద్, మే 15 (నమస్తే తెలంగాణ)/వ్యవసాయ యూనివర్సిటీ: వ్యవసాయరంగంలో తెలంగాణ రాష్ట్రం దూసుకెళ్తున్నదని, పంటల ఉత్పత్తి, ఉత్పాదకతలో ఎంతో ముందున్నదని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ ప్రశంసించారు. అందుకే వ్యవసాయరంగానికి సంబంధించిన అంశంపై జీ-20 సదస్సును జూన్ 15 నుంచి 17 వరకు హైదరాబాద్ వేదికగా నిర్వహిస్తున్నట్టు తెలిపారు. సోమవారం ఆయన జీ-20 సదస్సు ఏర్పాట్లపై హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీలో సమీక్షా సమావేశం నిర్వహించారు. అంతకుముందు వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని ‘విస్తరణ విద్యాసంస్థ (ఈఈఐ)’లో నూతనంగా నిర్మించిన ఆడిటోరియంను రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు.
ఆయా కార్యక్రమాల్లో నరేంద్రసింగ్ తోమర్ మాట్లాడుతూ.. జీ 20 సదస్సు ద్వారా తెలంగాణతోపాటు, భారత విశిష్టతను చాటి చెప్పేందుకు కలిసి పనిచేద్దామని పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ర్టాల ప్రభుత్వాలు వ్యవసాయరంగానికి ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉన్నదని చెప్పారు. ఈ రంగంలో పెట్టుబడులు, పరిశోధన, విస్తరణపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నదని పేర్కొన్నారు. అన్ని రకాల పంటల ఉత్పత్తిలో దేశాన్ని అగ్రగామిగా నిలిపేందుకు వ్యవసాయ శాస్త్రవేత్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. పెరుగుతున్న జనాభా అవసరాలను తీర్చడానికి ప్రణాళికలను రూపొందించాలని, పరిశోధనా ఫలాలను మారుమూల ప్రాంతాల్లోని సన్న, చిన్నకారు రైతాంగానికి సైతం అందుబాటులోకి తీసుకురావాలని కోరారు.
Niranjanreddy1
ఆహార ఉత్పత్తుల్లో తెలంగాణ అగ్రగామి
ఆహార ఉత్పత్తుల్లో తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా ఉన్నదని మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లో జీ-20 సదస్సును నిర్వహించడం తెలంగాణకు గర్వకారణమని చెప్పారు. సదస్సు నిర్వహణలో కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం అన్నివిధాలా సహకరిస్తుందని అభయమిచ్చారు. సదస్సుకు వచ్చే దేశ, విదేశీ అతిథులకు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయం, కళలను పరిచయం చేస్తామని, చారిత్రక విశిష్టతను చాటిచెప్తామని తెలిపారు. గత తొమ్మిదేండ్లుగా సీఎం కేసీఆర్ నాయకత్వంలో వ్యవసాయానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చిన తెలంగాణ రాష్ట్రం.. ఈ రంగంలో దేశానికి దిక్సూచిలా నిలిచిందని వివరించారు. తెలంగాణలో సాగుకు అనుకూలమైన నేలలు, వాతావరణ పరిస్థితులు, కష్టించే రైతులు ఉన్నారని కేంద్ర ప్రభుత్వం కూడా సహకరిస్తే మరిన్ని అద్భుత ఫలితాలు సాధిస్తామని చెప్పారు. తెలంగాణ వ్యవసాయ అనుకూల విధానాలను రాబో యే రోజుల్లో ప్రతి రాష్ట్రం అనుసరించాల్సిన ఆవశ్యకత ఏర్పడుతుందని చెప్పారు. సమావేశంలో కేంద్ర వ్యవసాయశాఖ కార్యదర్శి మనోజ్ అహూజా, రాష్ట్ర వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్‌రావు తదితరులు పాల్గొన్నారు.